ఆర్ట్ టైమ్స్, 24 అక్టోబర్, 2024 : పునరుత్పాదక విద్యుదుత్పత్తి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు పవన విద్యుత్ పై అధిక దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ విద్యుదుత్పత్తిలో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా చెన్నై నగరంలో భారీ అంతర్జాతీయ పవన విద్యుత్ ఆధారిత వాణిజ్య ప్రదర్శన ‘విండెర్జీ ఇండియా’ (Windergy India) ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుండి దాదాపు 300 మంది ఎగ్జిబిటర్లు ఈ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొని పవన శక్తి ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో బుధవారం లాంచనంగా ప్రారంభమైన మూడు రోజుల ఈ వాణిజ్య ప్రదర్శనలో అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలతో పాటు వ్యూహాత్మక సహకార అవకాశాలపై చర్చా కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IWTMA), పీడీఏ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘విండెర్జీ ఇండియా-2024’ను నిర్వహిస్తున్నారు. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ల సహకారం అందిస్తున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలో భారత MNRE అదనపు కార్యదర్శి, సుదీప్ జైన్ (IAS), తమిళనాడు ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి దా. బీలా వెంకటేషన్ (IAS), MNRE సంయుక్త కార్యదర్శి లలిత్ బోహ్రా (IRTS) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, మారుతున్న వాతావరణ మార్పుల నేపధ్యంలో పునరుత్పాదక శక్తిపై అన్ని దేశాలు దృషి సారిస్తున్నాయి. పవన శక్తి గతంలో కంటే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మొదటి రోజు ప్రదర్శనలో 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించే దిశగా భారతదేశం అనుసరిస్తున్న విధానాలపై ప్రముఖంగా చర్చలు జరిగాయి. నిపుణులు తులసి ఆర్. తంతి స్మారక ఉపన్యాసం ఇచ్చారు.
‘విండెర్జీ ఇండియా-2024’లో డెన్మార్క్, స్పెయిన్ దేశాలు అంతర్జాతీయ పెవిలియన్‌లను ఏర్పాటు చేశాయి. పవన శక్తి రంగాన్ని అభివృద్ధి చేయడంలో భారతదేశంతో పరస్పర సహకారానికి ఈ దేశాలు మద్దతు పలికాయి. అలాగే యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, చైనా, స్వీడన్, నార్వే, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, జపాన్ తదితర దేశాలకు చెందిన ఎగ్జిబిటర్‌లు కూడా విండెర్జీ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఈ కార్యక్రయం కీలక వేదికగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.