ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : కొన్ని రోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న హేమ కమిషన్ నివేదిక వ్యవహారం ఇతర చిత్ర పరిశ్రమలను కూడా కుదిపేస్తోంది. కోలీవుడ్ లో సీనియర్ నటి రాధిక సినిమా రంగంలో మహిళలపై అనాదిగా జరుగుతున్నా లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే గళం ఎత్తారు. టాలీవుడ్ లో కూడా హేమ కమిషన్ తరహా కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని నటి సామంత ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రికే ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ఇంకా పలువురు నటీమణులు ఏదో ఒక విధంగా ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సంకోచిస్తూ సూపర్ స్టార్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో కోలీవుడ్ గాయాని, నటి ఆండ్రియాని హేమ కమిషన్ గురించి అడిగితే.. ‘దాని గురించి నన్ను అడగద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై తిరువాన్మియూర్‌లోని వాల్మీకి నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మహిళల లోదుస్తుల స్టోర్ షెక్రటాస్ ప్రారంభోత్సవం ఆండ్రియా చేతుల మీదుగా జరిగింది.. ఆ సందర్భంగా ఆండ్రియా మాట్లాడుతూ, “ఈ స్టోర్ ను ప్రారంభించడం ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యవస్థాపకుడు హనీఫ్‌కు శుభాకాంక్షలు. మారుతున్న ఈ ప్రపంచంలో మహిళలందరికీ ఇవి చాలా ముఖ్యం. మహిళల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల బ్రాండ్ల లోదుస్తులు ఈ స్టోర్లో లభిస్తాయి” అన్నారు. అనంతరం, హేమా కమిషన్, సినీ రంగంలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఒక విలేఖరి ప్రశ్నించగా, దానికి ఆమె “అది నన్ను అడగవద్దు. నో కామెంట్స్” అని బదులు ఇచ్చారు. ఎప్పుడూ తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పే ఆండ్రియా ఈ విషయంలో మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
హేమ కమిషనా? ‘నో కామెంట్స్’ – ఆండ్రియా!
Trending Now