Monday, December 23, 2024
spot_img
HomeArtకుటుంబంలా కలిసి.. కన్నయ్యని కొలిచి..!

కుటుంబంలా కలిసి.. కన్నయ్యని కొలిచి..!

ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 2024 : శ్రీ కృష్ణపరమాత్ముని జన్మదిన వేడుకలను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో గోపికా కృష్ణుల సంబరాలు అంబరాన్నంటాయి. బాలకృష్ణుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. ఇక యువత కోలాహలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉట్టి కొట్టే వేడుకలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.  బాలబాలికలతో పాటు మహిళలు సైతం ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. బాలకృష్ణుని వేషధారణలో చిన్నారులు పరిగెత్తుకుంటూ వచ్చి ఉట్టి కొడుతుంటే.. నిజంగా చిన్ని కృష్ణుడే ఉట్టి కొడుతున్నాడా అనిపించేలా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వాడవాడలా కన్నయ్య సందడి నెలకొంది. ఆలయాల వద్ద, కూడళ్ళలో శ్రీ కృష్ణుడికి పూజలు చేసి, ఆయనకి ప్రీతిపాత్రమైన ప్రసాదం నివేదించి, పారాయణం, కోలాటం వంటి కార్యక్రమాలతో వేడుకలను కన్నుల పండుగలా జరిపించారు.

విల్లివిరిసిన ‘నవ చైతన్యం’…

భీమవరం 18వ వార్డులోని వీర పేరంటాలమ్మ చెరువు గట్టు దగ్గర నవ చైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెరువు దగ్గర వీధుల్లోని ప్రజలందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి శ్రీకృష్ణపరమాత్ముడిని కొలిచారు. ఆదిత్య బాబి, యర్రంశెట్టి రాజేష్, అడబాల మురళీకృష్ణ, యర్రంశెట్టి శివప్రసాద్ ల నేతృత్వంలో కమిటీ కుర్రాళ్ళు సాయి వెంకట్ మావుళ్ళు, మాదేటి మావుళ్ళు, మాదేటి నాని, కరీం, సాయి వంశీ తదితరులు కృష్ణాష్టమి ఏర్పాట్లను చేపట్టారు. ఆరు విభాగాల్లో ఉట్టి కొట్టినవారికి బహుమతులను ప్రదానం చేశారు. ముందుగా బాలకృష్ణుని చిత్రపటానికి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తరువాత జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో బాలబాలికలు, యువతీయువకులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారి శ్రీమోహనరావు ఉట్టి కొట్టడం ఈ వేడుకకు మరింత శోభనిచ్చింది. అలాగే చిన్న పిల్లలు బాలురు విభాగంలో శ్రీమోహనరావు, బాలికల విభాగంలో దర్శిత శ్రీ హరిణి, పదేళ్ళ లోపు విభాగంలో ఫణి కుమార్, 18 ఏళ్ళ విభాగంలో ఎండి అబ్దుల్ వహీద్, మహిళల విభాగంలో వై.గౌతమి, యువకుల విభాగంలో ఎం.మావుళ్ళు ఉట్టి కొట్టి, బహుమతులు అందుకున్నారు. ఆ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వీర పేరంటాలు చెరువు దగ్గర నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా అందరి సహకారంతో చక్కగా వేడుకలు జరిగాయని చెప్పారు. భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాలనే లక్ష్యంతో తెలుగు పండుగలను జరుపుతున్నామని, అందరూ ఓకే కుటుంబంలా కలిసి ఒకే చోట ఇలాంటి పండుగలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

‘ఉట్టి’ కొట్టడంలో దిట్ట.. ఉట్టిని చూస్తే ఊపు వచ్చేస్తుంది అంటున్నాడు పట్టణానికి చెందిన యువకుడు ఎం.మావుళ్ళు. చిన్నతనం నుండి ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటూ, ఉట్టి కొట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు అనేక చోట్ల ఎన్నో బహుమతులు అందుకున్నాడు. ప్రతి సంవత్సరం కనీసం రెండు చోట్ల ఉట్టి కొట్టి శ్రీకృష్ణుని చిత్రపటాలు అందుకోవడం అతనికి ఆనవాయితీగా మారింది. ఆ యువకుడి ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడు చిత్రపటాలే కనిపిస్తాయంటే, ఉట్టి కొట్టడంలో మావుళ్ళు సత్తా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చిన్నతనంలో మొదటిసరిగా ఉట్టి కొట్టినప్పుడు టిఫిన్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారని, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మావుళ్ళు చెప్పాడు. కాగా, 2024 వేడుకల్లో రెండు చోట్ల మావుళ్ళు ఉట్టి కొట్టి బహుమతులు అందుకున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular