ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 23, : సినీ సాంకేతిక కొత్త పుంతలు తొక్కిన తరువాత షార్ట్ ఫిలింలు తీసి దర్శకులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కోలీవుడ్ లో షార్ట్ ఫిలిం తీసి నిర్మాతలుగా మారడం ఆసక్తి కరమైన విషయం. షార్ట్ ఫిలింలు తీసే క్రమంలో స్నేహితులుగా మారిన కొందరు నిర్మాతలుగా మారి రూపొందిస్తున్న ఆ చిత్రమే ‘గెవి’. కొడైకెనాల్‌లోని కొండల్లో ఉన్న ‘వెల్లగెవి’ అనే గ్రామం నేపథ్యంతో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ట్ అప్ ట్రయాంగిల్స్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు తమిళ దయాళన్ దర్శకత్వం వహించారు. నూతన నటుడు ఆధవన్ హీరోగా తెరంగేట్రం చేస్తుండగా, ‘టు లెట్’, ‘మండేలా’ ఫేమ్ షీలా హీరోయిన్ పాత్రను పోషించింది. ఇంకా విజయ్ టీవీ జాక్వెలిన్, చార్లెస్ వినోద్, చిదంబరం, ధర్మదురై జీవా, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్ తదితరులు నటించారు. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించిన ఈ చిత్రానికి కవిపేరరసు వైరముత్తు, యుగభారతి గీత రచన చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో నటించిన అనుభవాలను హీరో ఆధవన్ మీడియాతో పంచుకున్నారు. “చిన్నప్పటి నుండి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లోని పాత్రల్లో నన్ను నేను ఊహించుకునేవాడిని. అలా సినిమాలు చూసే నటన నేర్చుకున్నాను. సినిమాలో నటించాలని చదువును మధ్యలోనే ఆపేసి ఒకవైపు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే మరోవైపు ఆటో, కారు నడిపేవాడిని. అప్పుడే ‘మెహందీ సర్కస్’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొంతమంది స్నేహితులు పరిచయమయ్యారు. అందరం కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీసి ‘నాలై ఇయక్కునర్’ పోటీలో పాల్గొన్నాం. అప్పుడే పూర్తి సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అంతేకాదు, ఆ సినిమాను మేమే నిర్మించాలని నిర్ణయించుకున్నాం. కథకి తగ్గట్టుగా కొడైకెనాల్ కొండల్లోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నాం. దాదాపు 110 రోజుల పాటు వెల్లగెవి ప్రాంతంలో షూటింగ్ చేశాం. ముఖ్యంగా వేసవిలో ఆ ప్రాంతంలో నీరు దొరకడం కూడా కష్టం. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో దాదాపు ఒకటిన్నర రోజులు గొంతు తడుపుకుని దాహం తీర్చుకున్నాం. క్లైమాక్స్ సన్నివేశాన్ని పర్వత శిఖరంపై చిత్రీకరించారు. అక్కడికి ఆహారాన్ని తీసుకెళ్లడం కష్టం కావడంతో మంచి నీళ్ళు క్యాన్ తీసుకువెళ్లి షూట్ చేశాం. మా కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు మాకు అందిస్తారని నమ్మకం ఉంది’ అని ఆదవన్ పేర్కొన్నారు.
షార్ట్ ఫిలిం తీశారు.. నిర్మాతలుగా మారారు!
Trending Now