ఆర్ట్ టైమ్స్, జూన్ 23 : తమిళ చిత్రపరిశ్రమలోని వైవిధ్యమైన నటుల్లో ఒకరైన ధనుష్ తన పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ధనుష్ కెరీర్లో మైలురాయి అయిన ‘రాయన్’తో పాటుగా ధనుష్ ని యూత్ కి దగ్గర చేసిన రెండు దశాబ్దాల నాటి సూపర్ హిట్ సినిమా ‘పుదుపేట్టై’ కూడా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ప్రసుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపధ్యంలో.. ధనుష్ పుట్టినరోజు కానుకగా ‘పుదుపేట్టై’ మళ్ళీ విడుదల చేయబోతున్నట్టు ఏటీఎం ప్రొడక్షన్స్ వెల్లడించింది.
విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన నటనతో సౌత్ ఇండియా, బాలీవుడ్ దాటి హాలీవుడ్ వరకు ప్రతిభను కనబరిచిన ధనుష్.. ఒక్క నటుడిగానే కాదు, నిర్మాతగా, మాటల రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా కూడా సత్తా చాటుకుంటున్నారు. ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ధనుష్.. కొద్ది విరామం తర్వాత ఇప్పుడు ‘రాయన్’తో మళ్ళీ దర్శకత్వ పటిమను చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇది ధనుష్ 50వ చిత్రం కూడా కావడంతో అభిమానుల్లోనే కాకుండా సగటు సినీ ప్రేక్షకుల్లోనూ ‘రాయన్’పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పంపిణీదారుడు మధురాజ్ ఏటీఎం ప్రొడక్షన్స్ తరపున ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘బిల్లా-2’ చిత్రాన్ని కూడా ఈ సంస్థ విడదల చేసిన విషయం తెలిసిందే. ధనుష్ అన్నయ్య, దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘పుదుపేట్టై’ కల్ట్ క్లాసిక్‌గా నిలిచి అభిమానులను విశేషంగా అలరించింది. ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. స్నేహ, సోనియా అగర్వాల్ కథానాయికలు.