Monday, December 23, 2024
spot_img
HomeArtప్రకృతి ఒడిలో.. వికసించిన కాన్వాస్..!

ప్రకృతి ఒడిలో.. వికసించిన కాన్వాస్..!

ప్రకృతి ఒడిలో.. వికసించిన కాన్వాస్..!

ఎత్తైన పర్వత శ్రేణులు.. తాకిపోయే మేఘాలు.. ఎటుచూసినా పచ్చదనం.. స్వచ్చమైన నీరు, గాలి.. పక్షుల కిలకిలారావాలు.. ఇలా అణువణువునా మనస్సుని పులకింపజేసే ప్రకృతి రమణీయత నడుమ చిత్రకారుల కుంచె ఓలలాడింది. కొలనులోని నీలి కలువలు, విరబూసిన తామరలు, వినీలాకాశ అందాలు, ఆధ్యాత్మిక పరిమళాలు, అశ్వ తేజస్సు, అమితమైన సౌందర్యరాశి.. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆ కుంచె నుండి జాలువారాయి.

ప్రకృతి ఒడిలో సేదతీరుతూ చిత్రకారులు తమ ఊహలకు కాన్వాస్ పై చిత్ర రూపాన్నిచ్చారు. ఇందుకు దేవభూమిగా విరాజిల్లుతున్న కేరళ రాష్ట్రంలోని వయనాడు పర్వత శ్రేణులు వేదికగా నిలిచాయి. చెన్నై నగరానికి చెందిన తపసియా ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫౌండేషన్, వయనాడు జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్, కేరళ పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2024, జూన్ 1, 2వ తేదీల్లో ‘ప్రకృతి ఒడిలో..’ (In the lap of nature) పేరుతో జాతీయ చిత్రకళా శిబిరం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మందికి పైగా చిత్రకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

కాన్వాస్ పై ఒదిగిన కర్లాడ్ సరస్సు వయనాడు పర్వత శ్రేణుల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ‘కర్లాడ్ లేక్’ (సరస్సు) వద్ద ఈ ఆర్ట్ క్యాంప్ జరిగింది. పర్వతాల నడుమ వెలసిన సహజసిద్ధమైన సరస్సు ఇది. నీలి కలువలతో మిరిమిట్లు గొలిపే ఈ సరస్సు ఒడ్డున చిత్రకారులు ఉప్పొంగిన ఉత్సాహంతో చిత్రాలను వేశారు. కొందరు చిత్రకారులు కర్లాడ్ సరస్సు అందాలను కాన్వాస్ పై అద్భుతంగా చిత్రీకరించారు. వయనాడు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ కార్యదర్శి అజీజ్, వయనాడు పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ డి.వి ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ చిత్రకళా శిబిరాన్ని లాంచనంగా ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న చిత్రకారులందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేసి ప్రశంసించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వైవిధ్యమైన పర్యాటక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ జాతీయ చిత్రకళా శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వయనాడు ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు అమలుచేస్తున్నామని, దేశ ప్రజలు వయనాడుని సందర్శించి, ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని కోరారు.

చిత్రకళా ‘వైవిధ్యం’.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ, వర్ధమాన చిత్రకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. వారిలో తెలుగు చిత్రకారులు కళారత్న దేవిప్రసాద్ (బెంగళూరు), బి. సూర్యనారాయణ (చోడవరం-వైజాగ్), రామకృష్ణారావు అలియాస్ రాఖీ (చెన్నై), ఎ.అప్పారావు (విజయవాడ), ఏ.విజయ (హైదరాబాద్) ఉన్నారు. అలాగే తమిళ చిత్రకారులు చెన్నై నుండి తపసియా డైరెక్టర్ జయప్రకాశ్, ఎం.పొన్ముడి, భాస్కర్, ఎస్వి కుమార్, జయంతి మురుగేషన్, ఎం.కుమార్ అలియాస్ జేకే, షీలా, మూకాంబిక బిఏ, అముద శాంతి, పదేళ్ళ చిన్నారి విజయశ్రీ, టి.మదినిరై సెల్వన్ (కోవై), జోన్స్ ఇమ్మానుయెల్ (పాండిచ్చేరి), బెంగళూరు నుండి షఫీక్ పునదిల్, హనుమంతు బైకోడ్, లావణ్య ఎం, అమిత్ కుమార్ శర్మ (జంషద్ పూర్), కేరళ నుండి నిషా భాస్కరన్, బిజు జెన్, అజిమోన్ కెవి, అజయ్ జోడియాక్, అస్సాం నుండి అజంతా దాస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ఈ కళాకారులందరూ కుంచె పట్టుకుని ఒక్క కుటుంబంలా కలిసిపోయారు. కాన్వాస్ పై కళా వైవిధ్యాన్ని చాటారు. ’తపోవన్’లో ఆత్మీయ కలయిక.. చిత్రకారులతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారు. వారికి ప్రకృతి తల్లి ఒడిలో సేదతీరే విధంగా మూడు రోజులపాటు వయనాడు పర్వత శిఖర సమీపాన ఉన్న ‘తపోవన్ ఆర్గానిక్ ఫార్మ్’లో బస్ ఏర్పాటుచేశారు. తపోవన్ నిర్వాహకులు, చెన్నైలోని తపసియా ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్, శిబిరం సమన్వయకర్త అజంతా చక్కని ఆతిథ్యం అందించారు. ప్రకృతి ప్రేమికులు, చిత్రకారులను ఒకే చోటకి చేర్చిన ఒక ఆత్మీయ కలయికగా కూడా చెప్పుకోవచ్చు. కళ గురించి చర్చించుకోవడానికి, కాంక్రీటు అరణ్యాలకు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరడానికి ఇదొక సువర్ణావకాశంగా అందరూ భావించారు. కళావారధులు.. ప్రకృతి ప్రేమికులు.. ఇక సీనియర్ చిత్రకారులు, ఆధ్యాత్మిక గురువు దేవిప్రసాద్, ఆయన శిష్యులు రాఖీ శిబిరంలో పాల్గొన్న అన్ని భాషల వారికి వారధులుగా నిలిచి, సమన్వయం చేశారు. వారి ప్రోత్సాహంతోనే పలువురు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్రాకృతిక కళా పర్యటనలో పాల్గొన్నారు. తమిళ చిత్రకారుడు మరద పొన్ముడి ఈ మూడు రోజుల పర్యటన తాలుకా మధుర స్మృతులను తన కెమెరాలో బంధించారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న చిత్రకారుల హావభావాలను శాశ్వతంగా నిలిచిపోయేలా చేసి మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చారు. చిత్ర రచనతోపాటు ప్రకృతి ప్రేమికులు ఈ పర్యటనను ఎంతగానో ఆస్వాదించారు. అనుక్షణం ప్రకృతి ఒడిలో గడుపుతూ అక్కడ ఉన్న మొక్కలు, వాటి విశిష్టత గురించి తెలుసుకునేందుకు ఆశక్తి కనబరిచారు. ఈ శిబిరంలో ఆటపాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు, మహిళలు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొని చిన్న పిల్లలైపోయారు. ఆఖరి రోజున క్యాంపు ఫైర్ దగ్గర చిత్రకారులు, ప్రకృతి ప్రేమికులు అంత్యాక్షరి పోటీలతో సంగీత జల్లులు కురిపించారు. తెలుగు, తమిళం, హిందీ పాటలతో అంత్యాక్షరి చాలా సందడిగా సాగింది. హిందీ ప్రచార సభ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావు సతీమణి శారద, చిత్రకారులు రాఖీ సతీమణి సాధన, చిత్రకారిణులు విజయ, అజంతా, దేవీప్రసాద్ చక్కగా పాటలు పాడి అలరించారు. అలాగే క్యూరేటర్ అజంతా, తమిళ చిత్రకారిణులు మూకాంబిక, అముదశాంతి గాత్ర ప్రతిభకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.

ప్రతి మనిషిలోనూ వెలుగుని చూడాలి – కళారత్న ప్రముఖ తెలుగు చిత్రకారులు, ఆధ్యాత్మికవేత్త ‘కళారత్న’ దేవిప్రసాద్ ఈ శిబిరంలో గురు స్థానంలో ప్రతి ఒక్కరికి అనేక విషయాలపై మార్గ నిర్దేశం చేశారు. చిత్రకళతోపాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి, ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరిమళాలు విరబూసేలా చేశారు. భావితరాలకు ఉపయోగపడే చక్కని సందేశాలను తెలియజేస్తూ, ప్రకృతిలో వైశిష్ట్యాన్ని తనదైన శైలిలో అందరికీ వివరించారు. యోగా, కలర్ థెరపీ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. రంగులు మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “చిత్రకారులు రంగురంగుల బొమ్మలు, చిత్రాలు గీస్తారు. ఎన్నో రంగులు వాడుతారు. రంగులను కలిపి అద్భుతాలు సృష్టిస్తారు. అయితే ఆ రంగుల విశిష్టతను, వాటి అర్ధాన్ని, అవి మనపై చూపే ప్రభావాన్ని ఎవరూ గ్రహించరు. వాటిని తెలియజేసేదే కలర్ థెరపి. ప్రతి మనిషిలోనూ వెలుగుని చూడడం నేర్చుకోవాలి, ఆ వెలుగు మన మాటల్లో ప్రతిబింబించాలి. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అర్థవంతంగా ఉండాలి, దానికి ఒక లక్ష్యం ఉండాలి” అని ఉపదేశించారు. ప్రాణాలను రక్షిద్దాం..! ఈ శిబిరంలో భాగంగా ప్రధమ చికిత్స పద్ధతులు, ఆవశ్యకతను గురించి చెన్నైకి చెందిన చిత్రకారిణి జయంతి మురుగేషన్ తనయుడు, రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ (ఇండియా) సభ్యుడు తరుణ్ చాలా చక్కగా వివరించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరైనా అత్యవసర వైద్య సేవలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు తక్షణ అందించవలసిన ప్రథమ చికిత్స విధానాలను సవివరంగా తెలియజేశారు. చిత్రకళపై ‘చిన్నారి’ ఆసక్తి.. ఈ శిబిరంలో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కురాలు చెన్నైకి చెందిన విజయశ్రీ. పదేళ్ల ఆ చిన్నారి ఆరవ తరగతి చదువుతూ చిత్ర రచనలో తన ప్రతిభను చాటుకుంటోంది. మూడేళ్ల ప్రాయం నుండే బొమ్మలు గీయడం ప్రారంభించిన విజయశ్రీ ప్లే స్కూల్ స్థాయిలోనే డ్రాయింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించి డ్రాయింగ్ శిక్షణ ఇప్పించారు. ఆమె తండ్రి విజయేంద్రన్ తన కుమార్తె అభిరుచిని గ్రహించి ప్రోత్సహిస్తున్నారు. వయనాడు శిబిరంలోనే ఆమె తొలిసారి కాన్వాస్ పై బొమ్మ గీసింది. ఎటువంటి చిత్రకళా నేపథ్యం లేకుండా ఈ రంగంలోకి వచ్చిన చిన్నారి విజయశ్రీ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సీనియర్ చిత్రకారులు ఆశీస్సులందించారు.
ఉట్టిపడిన జీవకళ.. ఆంద్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా నుండి ఈ శిబిరంలో పాల్గొన్న చిత్రకారులు చోడవరానికి చెందిన సూర్యనారాయణ గీసిన గిరిజన స్త్రీ చిత్రానికి ప్రత్యేక ప్రశంస దక్కింది. ఆ చిత్రాన్ని చూసి ముఖ అతిథులుగా పాల్గొన్న కేరళ పర్యాటక శాఖ అధికారులు, తోటి చిత్రకారులు కూడా అచ్చెరువొందారు. ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడుతోందని కొనియాడారు. ఆయన మనవడు శ్రీరాం కర్లాడ్ సరస్సులో కాయంగ్ బోటింగ్ కి వెళ్లి ధైర్య సాహసాలను చాటుకున్నాడు.

వృత్తి చిత్రకళ – ప్రవృత్తి మొక్కలతో సావాసం.. చిత్రకారులకు ఆతిథ్యం ఇచ్చిన ‘తపోవనం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిందే. చెన్నై నగరంలో ఆర్ట్ స్కూల్ నిర్వహిస్తున్న చిత్రకారులు జయప్రకాష్ వయనాడు పర్వత శిఖర సమీపాన తప్పవనం ఆర్గానిక్ ఫార్మ్ ను నిర్వహిస్తున్నారు. అక్కడ అడుగడుగునా వివిధ రకాల ఔషధ మొక్కలు, ఇతర దేశాలకు చెందిన ప్రత్యేకమైన జాతులుకు చెందిన మొక్కలు మనకు కనిపిస్తాయి. మేఘాలలోంచి నడుచుకుంటూ వెళ్లే అత్యద్భుతమైన మరపురాని అనుభవాన్ని తపోవనం అందించింది. జయప్రకాష్ ఒక చిత్రకారుడు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కలపై అమితమైన మమకారం కలిగిన వ్యక్తి. తపోవనంలో వందకు పైగా ప్రత్యేక జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. అక్కడ ఏ చెట్టు గురించి అడిగినా, ఏ కొమ్మను చూపించినా, ఏ పండు గురించి అయినా వాటి వివరాలు అనర్గళంగా చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారంటే జయప్రకాష్ కి మొక్కలంటే ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు. ప్రవృత్తి రీత్యా చిత్రకారులైన జయప్రకాష్ తన సృజనాత్మక హృదయాన్ని తపోవనంలో మరింత విశాలపరిచారు. చిత్రకారులకి చక్కని బస ఆహార ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడున్న మొక్కల గురించి, వాటి విశిష్టత గురించి చక్కగా వివరించారు. అరుదైన పండ్ల జాతులకు చెందిన మొక్కలను చూపించి, ఆ పండ్లను రుచి చూసే అవకాశాన్ని కల్పించారు.
క్యూరేటర్ అజంతా.. ఈ శిబిరానికి క్యూరేటరుగా బాధ్యతలు నిర్వహించిన బెంగాలీ ఆర్టిస్ట్ అజంతా చిత్రకారులు అందరితోనూ కలిసిపోయి ఒక కుటుంబ సభ్యురాలిగా ఆప్యాయంగా పలకరిస్తూ చిత్రకళా శిబిర నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె చక్కగా ఆడుతుంది, అందంగా పాడుతుంది కూడా.
ఇదొక సువర్ణావకాశం.. శిబిరంలో పాల్గొన్న అనుభవాలను చిత్రకారులు పంచుకుంటూ.. “వివిధ చిత్రకళా పద్ధతులు, సృజనాత్మక భావాలను రాబోయే తరంతో పంచుకునేందుకు ఇదొక చక్కని వేదిక. సాధారణ జీవితాన్ని వదిలిపెట్టి ప్రకృతి ఒడిలో గడిపేందుకు మంచి అవకాశం దొరికింది. వేర్వేరు ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన చిత్రకారులు ఒకరికొకరు తెలుసుకునేందుకు, వారి చిత్రకళా చాతుర్యాన్ని చాటుకునేందుకు ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది” అని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి ప్రేమికులు స్పందిస్తూ, “వయనాడు పర్వత శ్రేణుల్లో చిత్రకారులతో కలిసి పాల్గొనడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని, ఇక్కడ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించామని, ప్రముఖ ఆర్టిస్టులను కలుసుకునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంద”ని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular