ఆర్ట్ టైమ్స్ : దేవయాని.. తమిళం, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం కథా బలమున్న పాత్రలు పోషిస్తూ ఈ తరం ప్రేక్షకులని కూడా అలరిస్తున్నారు. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు ప్రేక్షకులనే కాదు, సినీ ప్రముఖుల్ని సైతం మెప్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని నటుడు, రాజకీయవేత్త సీమాన్ ‘నిళర్ కుడై’ సినిమా పాటల విడుదల వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేవయాని ప్రధాన పాత్రలో మాతృత్వం గొప్పతనాన్ని చాటే మంచి సందేశాత్మక కథతో తెరకెక్కుతున్న ‘నిళర్ కుడై’ చిత్రం ఆడియోని చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.

దర్శన్ ఫిల్మ్స్ పతాకంపై జ్యోతి శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ ఆరుముగం కథ, స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు. యువతారలు విజిత్, కన్మణి హీరోహీరోయిన్లు. దేవయాని అమ్మ గొప్పతనాన్ని చాటే ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఇద్దరు బాలతారలు, ఇళవరసు, రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, వడివుక్కరసి, నీలిమ ఇసై, నిహారిక, అహనా తదితరులు సహాయక పాత్రలో నటించారు. దర్శన్ శివ అనే కొత్త నటుడు విలన్ పాత్రలో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్స్ సంస్థ తమిళనాడు, పుదుచ్చేరి థియేట్రికల్ విడుదల హక్కులను పొందగ, మే 9న ‘నిళర్ కుడై’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నరేన్ బాలకుమార్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఆడియోని గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్, నామ్ తమిళర్ పార్టీ నాయకుడు సీమాన్, దర్శకుడు పేరరసు, నిర్మాత డి.శివ, ఫెప్సీ చైర్మన్, డైరెక్టర్ ఆర్కే సెల్వమణి, నటి వనిత విజయకుమార్, నమిత, నిర్మాత మదియళగన్‌తో తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ, “నటి దేవయాని మంచి సినిమాలు, పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆ రోజుల్లో కె.ఆర్. విజయ, తరువాత తరంలో రేవతి తరహాలో దేవయాని కూడా ఇప్పుడు మంచి కథా పాత్రలు పోషిస్తున్నారు. డబ్బు కోసం అన్ని చిత్రాలను అంగీకరించి తన పేరును ఎప్పుడూ పాడు చేసుకోలేదు. ఆ ఖ్యాతే 30 ఏళ్ల తర్వాత కూడా ఆమెని హీరోయిన్‌గా నిలబెడుతోంది” అని కితాబిచ్చారు.
