Monday, April 7, 2025
spot_img
HomeNewsతమిళ గడ్డపై తెలుగు విద్యార్ధుల కరాటే ప్రతిభ.. బ్లాక్ బెల్ట్ సాధించిన పాలకొల్లు విద్యార్ధులు

తమిళ గడ్డపై తెలుగు విద్యార్ధుల కరాటే ప్రతిభ.. బ్లాక్ బెల్ట్ సాధించిన పాలకొల్లు విద్యార్ధులు

ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 23, 2025): తమిళనాడు రాష్ట్రంలో తెలుగు విద్యార్ధులు కరాటేలో ప్రతిభను చాటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకి చెందిన ఇరువురు కరాటే విద్యార్ధులు బ్లాక్ బెల్ట్ సాధించి, అంతర్జాతీయ కరాటే మాస్టర్ల ప్రశంసలు పొందారు. భీమవరం, పాలకొల్లులో కరాటే శిక్షణ ఇస్తున్న జపాన్ హయాషిహ-కరాటే డు ఇండియా మాస్టర్, సీనియర్ కరాటే శిక్షకులు షిహాన్ జే. విజయ భాస్కర్ నేతృత్వంలో తొమ్మిది మంది విద్యార్ధులు తంజావూరు వెళ్ళారు. సుప్రసిద్ధ బృహదీశ్వరాలయం కొలువుదీరిన తంజావూరులోని అన్నై సత్య ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 21, 22 తేదీలలో రెండు రోజుల కరాటే బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్, శిక్షణ శిబిరం జరిగింది. ఈ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రెడ్డి పాళయంలో కరాటే బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించారు. ఆంధ్రాతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా సహా పలు రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా సీనియర్ బ్రౌన్ బెల్ట్ విద్యార్థులు, కరాటే అభ్యాసకులు పాల్గొన్నారు. మలేషియా నుండి వచ్చిన గ్రాండ్ మాస్టర్ హన్షి డాక్టర్ టోనీ పొన్నయ్య, అంతర్జాతీయ కరాటే శిక్షకులు డత్తో షిహాన్ అరివళగన్ పొన్నయ్య కరాటే ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్లాక్ బెల్ట్, సర్టిఫికెట్లు అందజేశారు. భీమవరం, పాలకొల్లు నుండి వెళ్ళిన తొమ్మిది మంది విద్యార్ధులు శిక్షణ శిబిరంలో పాల్గొనగా, పి. శ్రీనివాస శివకుమార్ (పాలకొల్లు), పి.యశోద కృష్ణ (పాలమూరు)లు బ్లాక్ బెల్ట్ సాధించారు.

అంతర్జాతీయ కరాటే కోచ్ షిహాన్ అరివళగన్ పొన్నయ్యతో భీమవరం కరాటే మాస్టర్ విజయ భాస్కర్

కరాటే శిక్షకులు షిహాన్ జే. విజయ భాస్కర్ ‘ఆర్ట్ టైమ్స్’ తో మాట్లాడుతూ, మలేసియా నుండి వచ్చిన కరాటే దిగ్గజాల సమక్షంలో తమ విద్యార్ధులు శిక్షణ పొందడం, వారి చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్, సర్టిఫికేట్ అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తమ సంస్థకే గర్వకారణమని పేర్కొన్నారు. బాలబాలికలకు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యలు తప్పనిసరిగా నేర్పించాలని, కరాటే శిక్షణతో విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన, క్రమశిక్షణ అలవాడతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, భీమవరంలోని బ్యాంక్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో, పాలకొల్లులోనూ రెండు చోట్ల కరాటే మాస్టర్ విజయ భాస్కర్ నేతృత్వంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 150 మంది కరాటే శిక్షణ పొందుతున్నారు. ప్రతి ఆరు నెలలకి ఒకసారి పరీక్షలు నిర్వహించి, విద్యార్ధులకి కరాటే బెల్ట్ అందజేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular