ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 17, 2025) : తన గుండెల నిండా శ్రీరామచంద్రుడే నిండి ఉన్నాడని గుండెలను చీల్చి చూపాడు ఆంజనేయుడు.. తమ మనసంతా శ్రీరాముడినే నింపుకుని కాన్వాస్ పై రామాయణాన్ని సాక్షాత్కరింపజేశారు తెలుగు చిత్రకారిణులు. ఇందుకు హైదరాబాద్ శివారు ముచ్చింతల్ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వేదికైంది. ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు దార్ల నాగేశ్వరరావు స్ఫూర్తితో మహిళా చిత్రకారులతో ఫిబ్రవరి 16వ తేదీన ‘మనసంతా రామమయం’ పేరుతో ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు. శ్రీరామనుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ‘సమతా కుంభ్ 2025’లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం విశేషం.

వుమెన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (WAA) ఆధ్వర్యంలో కాసుల పద్మావతి నేతృత్వంలో 30 మందికి పైగా చిత్రకారిణులు ఈ కార్యక్రమంలో పాల్గొని, రామాయణంలోని వివిధ ఘట్టాలని అద్భుతంగా చిత్రీకరించి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు. ఆ సందర్భంగా తెలుగు చిత్రకారిణి విజయ ఆయంచ ‘ఆర్ట్ టైమ్స్’తో మాట్లాడుతూ, అణువణువునా ఆధ్యాత్మికత నిండిన ప్రదేశంలో, సమతా కుంభ్ 2025 వంటి గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవంలో ఒక చిత్రకారిణిగా పాల్గొనడం, ‘మనసంతా రామమయం’ చిత్ర ప్రదర్శనలో భాగస్వామ్యం దక్కడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన తోటి చిత్రకారిణులు అందరూ రాముని చిత్రాలను అత్యద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.