ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 1, 2025) : తెలుగు చిత్రకళ దిగ్గజాలు వడ్డాది పాపయ్య, బాపులను స్మరించుకుంటూ, వారి చిత్రకళ సేవానిరతిని భావితరాలకు అందించే లక్ష్యంతో స్థాపించిన వపా-బాపు ఆర్ట్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం బాల బాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పాలకొల్లులోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ వేదికగా జరిగిన ఈ పోటీలలో 350 మంది పైగా బాల బాలికలు పాల్గొని ఎంత ఉత్సాహంగా బొమ్మలు గీశారు. లయన్స్ క్లబ్ పాలకొల్లు, జేసిఏ రైజింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ వార్షికోత్సవంలో భాగంగా చిత్రలేఖన పోటీలు, ప్రముఖ చిత్రకారుల స్పాట్ పెయింటింగ్ ఆర్ట్ క్యాంప్, చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు ఆదివారం వేదిక ప్రాంగణంలో అక్కడికక్కడే చిత్రాలు గీయనున్నారు. అనంతరం పలువురు చిత్రకారులను సత్కరించనున్నారు. కాగా, పాలకొల్లు వాస్తవ్యులు, చెన్నైలో స్థిరపడి చిత్రకళాకారుడిగా ఎదిగి తమిళ తెలుగు చిత్రకారులకు వారిధిగా నిలిచిన రామకృష్ణారావు అలియాస్ రాకీ.. సీనియర్ చిత్రకారుల స్ఫూర్తి, పాలకొల్లు చిత్రకారులు, లయన్స్ క్లబ్ సహకారంతో 2015లో వపా- బాపు ఆర్ట్ అకాడమీని స్థాపించారు.
వపా-బాపు చిత్రకళకు రెండు కళ్ళు..
చిత్రలేఖన పోటీలను మధ్యాహ్నం రెండు గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అకాడమీ వ్యవస్థాపకులు రాఖీ రామకృష్ణారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డా. కొయ్య జయభారత రెడ్డి, అకాడమీ అధ్యక్షులు కొసనా భాస్కరరావు, కార్యదర్శి చెల్లుబోయిన రాము, కోశాధికారి నక్కా వెంకటేశ్వరరావు, సీనియర్ చిత్రకారులు జిఎస్ఎన్, రత్న ప్రింటింగ్ వర్క్స్ ముత్యాల రామారావు, లయన్స్ క్లబ్ సభ్యులు ఎస్ కామేశ్వరరావు, అధికారి కృష్ణ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయ గ్రూప్ ఆఫ్ ల్యాబ్స్ అధినేత, లయన్స్ క్లబ్ పూర్వాధ్యక్షులు కొమ్ముల మురళీకృష్ణ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవస్థాపకులు రాకీ మాట్లాడుతూ, ఆంధ్రదేశ చిత్ర కళారంగానికి వపా, బాపు రెండు కళ్ళు అని, వారు అందించిన చిత్ర కళా సంపదను భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చిత్రకారులను, బాల చిత్రకారులను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అకాడమీ అధ్యక్షులు భాస్కరరావు మాట్లాడుతూ, కళా రంగంలో ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించడం, చిత్రకళాభివృద్ధి కోసం అకాడమీ ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చిత్రకారులు బొడ్డేటి సూర్యనారాయణ (చోడవరం), డ్రీమ్స్ చిల్డ్రన్ రమేష్ (విజయవాడ), డి.ధర్మలింగం (చెన్నై), రాజగోపాల్ (కోయంబత్తూరు), యువ చిత్రకారుడు రాకేశ్, 64 కళలు.కాం ఎడిటర్ కళాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మకను వెలికితీసే చిత్రకళ..

లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ కొయ్య జయభారత్ రెడ్డి మాట్లాడుతూ, అకాడమీ ప్రారంభం నుండి లయన్స్ క్లబ్ సహకారం నిర్విరామంగా కొనసాగుతోందని, అకాడమీ అభివృద్ధిలో వ్యవస్థాపకులు రాకీ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చిత్రకళ దోహదం చేస్తుందని, ఆ దిశగానే బాలబాలికలకు చిత్రలేఖన పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జేసిఏ రైజింగ్ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ, ప్రస్తుత కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో చిత్రకళ కనుమరుగైపోయే ప్రమాదం ఉందని, ఈ కళను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, ఇటువంటి కార్యక్రమాలతో బాలబాలికల్లో చిత్రకళ స్ఫూర్తిని ప్రేరేపించాలని సూచించారు.
ఆకట్టుకున్న క్లాత్ బ్యానర్..

వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్లాత్ బ్యానర్ ఆహుతులను, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన చిత్రకాలను విశేషంగా ఆకట్టుకుంది. డిజిటల్ ఫ్లెక్సీల హవా నడుస్తున్న ప్రస్తుత సమయంలో క్లాత్ బ్యానర్లు రూపొందించే కళాకారులకు ఉపాధి దాదాపుగా లేదనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో క్లాత్ బ్యానర్లను ప్రోత్సహించే విధంగా అకాడమీ వార్షికోత్సవ వేడుకలో క్లాత్ బ్యానర్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం.
బాలబాలికల కోలాహలం..



ఇకపోతే చిత్రలేఖన పోటీలలో ఉండి, మండపేట, పెనుగొండ నూజివీడు, పాలకోల్లు చుట్టుపక్కల ప్రాంతాలు నుండి వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 350 మందికి పైగా బాలబాలికలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా బొమ్మలు వేశారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3, 4, 5 తరగతుల వారికి పుష్పాలు, జూనియర్ విభాగంలో 6, 7, 8 తరగతుల వారికి ప్రకృతి అందాలు, సీనియర్ విభాగంలో 9, 10 తరగతి వారికి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు వేయాలని సూచించారు. పోటీలలో పాల్గొన్న వారికి డ్రాయింగ్ పేపర్ను నిర్వాహకులే అందించారు. వేదిక ప్రాంగణం మొత్తం బాలబాలికలతో నిండిపోయి కోలాహలం నెలకొంది. గంటన్నర సమయంలో చిన్నారులు తమకు కేటాయించిన అంశంతో చక్కగా బొమ్మలు గీశారు. బొమ్మలు వేసేందుకు బాలబాలికలు చూపించిన ఉత్సాహం, వారి చిత్రకళా ప్రతిభ ఆహుతులను ఆకట్టుకుంది. చిన్నారులలోని కోమలత్వం వారి వారి గీసిన బొమ్మల్లోనూ అగుపించింది. ఆ బొమ్మలకు వారు అద్దిన రంగులు వీక్షకులను ముగ్దుల్ని చేశాయి. అంతకుముందు డ్రాయింగ్ టీచర్ల పర్యవేక్షణలో పోటీలకు హాజరైన చిన్నారులు ముందుగా వేదిక ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీనియర్ కళాకారుల చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. చోడవరం సూర్యనారాయణ వేసిన గిరిజన మహిళల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



