ఆర్ట్ టైమ్స్ : తమిళ నటుడు అరుణ్ విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ‘వనంగాన్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరుణ్ విజయ్ పుట్టినరోజు (నవంబర్ 19) సందర్భంగా నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. బి స్టూడియోస్ సహ నిర్మాణంలో వి.హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న ‘వనంగాన్’ చిత్రాన్ని జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ సరసన రోషిణి ప్రకాష్ నటిస్తోంది. సముద్రఖని, మిస్కిన్, రాధారవి, జాన్ విజయ్, రవి మారయ్య, సింగంపులి, ఆరుళ్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం, శామ్ సిఎస్ నేపథ్య సంగీతం అందించగా, కవిపేరరసు వైరముత్తు పాటలు రాశారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
‘మానాడు’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వి హౌస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం కావడం, బాలా – అరుణ్ విజయ్ కాంబినేషన్ లో తొలి చిత్రం కావడంతో ‘వనంగాన్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత బాలా దర్శకుడిగా పునరాగమనం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌కి కూడా మంచి స్పందన లభించింది. దీంతో ‘వనంగాన్’ విజయంపై హీరోతో పాటు చిత్ర యూనిట్ ధీమాతో ఉన్నారు. ఈ విషయమై అరుణ్ విజయ్ మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే షూటింగ్ సమయంలో కథ ప్రభావం పూర్తిగా కనిపించలేదు. కానీ ఇప్పుడు వెండితెరపై చూస్తుంటే ఎంత బాగా వచ్చిందో చెప్పడానికి మాటలు రావడం లేదు. నా సినీ కెరీర్లో ‘వనంగాన్’ చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. ప్రేక్షుకులకు బాగా నచ్చుతుంది” అన్నారు.