ఆర్ట్ టైమ్స్, నవంబర్ 17, 2024: ఏదో ఒక సందర్భంలో తనకు తారసపడిన దృశ్యాన్ని మదిలో నిక్షిప్తం చేసుకుని.. ఆ దృశ్యాన్ని కాన్వాస్ పై అందంగా మలిచి కళాభిమానుల మనసులు గెలుచుకున్నారు తెలుగు యువ చిత్రకారుడు, హైదరాబాదులోని కేఎల్ యూనివర్సిటీ ఆర్ట్స్ మెంటార్ అద్దిపల్లి అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ చోడవరం వాసి అయిన అప్పలనాయుడు చిన్న వయసులోనే చిత్రకళా ప్రతిభను చాటుకుని, ప్రస్తుతం కే ఎల్ యూనివర్సిటీలో చిత్ర రచనలో శిక్షణ ఇస్తున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన శ్రీ దర్శిని కలైకూడం జాతీయ చిత్ర కళా పురస్కార ప్రదానోత్సవ వేడుకలో ఆయన్ని సత్కరించారు. చిత్రకళ పట్ల ఆయనకున్న అభిమానాన్ని, అభిరుచిని సీనియర్ చిత్రకారులు, కళాభిమానులు కొనియాడారు.
చెన్నై టి.నగర్ జి.ఎన్.చెట్టి రోడ్డులో ఉన్న వాణి మహల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దర్శిని కలైకూడం జాతీయ స్థాయిలో చిత్రకారులకు నిర్వహించిన పోటీలు, చిత్ర ప్రదర్శన కోసం అద్దిపల్లి వేసిన చిత్రం కళాభిమానుల ప్రశంసలందుకుంది. చార్ కోల్ మీడియంలో నాలుగైదు రోజులపాటు కష్టపడి ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. తమిళనాడు టి.నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జె.కరుణానిధి చేతుల మీదుగా అద్దిపల్లిని సత్కరించి, జ్ఞాపిక, నగదు బహుమతి ప్రదానం చేశారు.