ఆర్ట్ టైమ్స్, నవంబర్ 11, 2024 : తెలుగు చిత్ర కళా వైభవాన్ని, చిత్రకారుల కళా సేవను భావితరాలకు అందించే ఉద్దేశ్యంతో ముద్రితమైన ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అరుదైన పుస్తకమని, ఇందులో తనకు కూడా చోటు దక్కడం గర్వంగా ఉందని సీనియర్ తెలుగు చిత్రకారులు, చోడవరం చిత్రకళా నికేతన్ వ్యవస్థాపకులు బొడ్డేటి సూర్యనారాయణ పేర్కొన్నారు. గిరిజన ప్రజల జీవన శైలిని, వారి సంస్కృతిని కాన్వాస్ పై కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరింపజేయడంలో ఆయనకు ఆయనే సాటి. అలా ఆయన కుంచె నుండి జాలువారిన రెండు చిత్రాలను, సూర్యనారాయణ కళా జీవిత వివరాలను ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’లో పొందుపరిచారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరమ్ పార్క్ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ఆవిష్కరించారు. 64 కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకులు కళాసాగర్ సంపాదకత్వంలో ముద్రితమైన ఈ పుస్తకంలో వడ్డాది పాపయ్య, బాపులాంటి దిగ్గజాలను స్మరించుకుంటూ, నేటి సమకాలీన చిత్ర, శిల్ప కళాకారులతో పాటు కలంకారి, ఏటికొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మల కళాకారులు 300 మందికి చోటు కల్పించారు. ఆవిష్కరణ సభలో గిరిజన గీత శిల్పి, ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ డా. బొండా జగన్మోహన రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సి.వి. రాజు, రచయిత, కవి గంటేడ గౌరునాయుడు, సీనియర్ చిత్రకారులు గిరిధర్ గౌడ సమక్షంలో సూర్యనారాయణను నిర్వాహకులు సత్కరించారు. ప్రేమ సమాజము రాజు, ఓ.ఆర్.ఆర్.సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కృష్ణ, కన్నయ్యశెట్టి తదితరులు ఆయన కళా సేవను కీర్తిస్తూ అభినందనలు తెలియజేశారు. ఆ సందర్భంగా సూర్యనారాయణ స్పందిస్తూ, “వడ్డాది పాపయ్య, బాపు లాంటి దిగ్గజాల సరసన నాకు కూడా చోటు దక్కడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. రూపకల్పన, ముఖ చిత్రం, డిజైన్ చాలా బాగుంది. చక్కని నాణ్యతతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇటువంటి పుస్తకాలు రావడం అరుదు. చిత్ర కళా రంగంలో ఈ పుస్తకానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది” అని పేర్కొన్నారు.
‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అరుదైన పుస్తకం.. చోడవరం చిత్రకళా నికేతన్ వ్యవస్థాపకులు సూర్యనారాయణ
Trending Now



