Wednesday, May 6, 2026
spot_img
HomeArtతెలుగు ‘చిత్ర కళ’కు అక్షరరూపం... కృష్ణా తీరంలో ఆవిష్కృతం

తెలుగు ‘చిత్ర కళ’కు అక్షరరూపం… కృష్ణా తీరంలో ఆవిష్కృతం

ఆర్ట్ టైమ్స్, నవంబర్ 11, 2024: దిగ్గజ చిత్రకారుల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేస్తూ, వర్ధమాన చిత్రాకరులకు స్ఫూర్తినిచ్చే కథనాలను ప్రచురిస్తూ చిత్ర కళా వైభవాన్ని చాటుతున్న www.64kalalu.com వెబ్ పత్రిక తెలుగు చిత్రకారులకు అపురూప కానుకను అందించింది. ఎందరో కళాకారులు – అందరికీ వందనాలు.. అంటూ నవ్యాంధ్రప్రదేశ్ కు చెందిన దామెర్ల రామారావు, వరద వెంకటరత్నం, భగీరథి, అడవి బాపిరాజు, గుర్రం మల్లయ్య, అంకాల వెంకట సుబ్బారావు, పైడిరాజు, మాధవపెద్ది గోఖలే, సిఎస్ఎన్ పట్నాయక్, వడ్డాది పాపయ్య, ఎస్ఎం కేతా, బాపులాంటి చిత్ర కళా రంగ మహానుభావులను స్మరించుకుంటూ, నేటి సమకాలీన చిత్ర, శిల్ప కళాకారులతో పాటు కలంకారి, ఏటికొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మల కళాకారులను చేర్చి.. 300 మంది కళాకారుల పరిచయాలతో రెండు తరాల కళాకారులకు వారధిగా ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే పుస్తకాన్ని అచ్చు వేశారు 64కళలు సంపాదకులు కళాసాగర్. దాదాపు మూడేళ్ల పాటు శ్రమించి రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు చిత్రకారులను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కలిసి వారి అనుభవాలను ఆలోచనలను సమీకరించి ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’లో పొందుపరిచారు.

‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు

ఈ పుస్తకాన్ని దుర్గమ్మ తల్లి కొలువుదీరిన విజయవాడ కృష్ణా నది తీరంలో ఆదివారం (నవంబర్ 10)న ఆవిష్కరించారు. భవానిపురంలోని హరిత బెరమ్ పార్క్ కాన్ఫరెన్స్ హాలు వేదికగా జరిగిన ఈ కార్యక్రమం గిరిజన గీత శిల్పి, ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ డా. బొండా జగన్మోహన రావు జ్యోతి ప్రజ్వలనతో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ సభాధ్యక్షత వహించి ‘కైమోడ్పులివె కళల లోగిళ్లకు’ పాటను, ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సి.వి. రాజు ’64కళలు.కామ్’ స్పటిక జయంతి సంచికను విడుదల చేశారు. చిత్రకారులు, ఆంద్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం ప్రొఫెసర్ వి.రమేష్, ‘కైమోడ్పులివె కళల లోగిళ్ళకు’ పాట రచయిత, కవి గంటేడ గౌరునాయుడు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

సీనియర్ చిత్రకారులు చోడవరం సూర్యనారాయణను సత్కరిస్తున్న నిర్వాహకులు

ఆ సందర్భంగా చోడవరం చిత్ర కళా వ్యవస్థాపకులు బొడ్డే టి.సూర్యనారాయణ వంటి పలువురు సీనియర్ చిత్రకారులను సత్కరించి, పుస్తకాన్ని బహూకరించారు.  సీనియర్ చిత్రకారులు గిరిధర్ గౌడ, ప్రేమ సమాజము రాజు, ఓఆర్ఆర్సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కృష్ణ, కన్నయ్యశెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కళాప్రజ్ఞకు అక్షర రూపమిచ్చే గొప్ప ప్రయత్నం.. శతాబ్దాల తరబడి గొప్ప చారిత్రాత్మక కళా సంపదను సృష్టించి చరిత్రలో తమ ఆనవాళ్లు లేకుండా కనుమరుగైన శిల్ప చిత్ర కళాకారులు ఎందరో ఉన్నారు. అందుకే చిత్ర కళా సంపదను భావి తరాలకు అందించాలన్న సంకల్పంతో రూపుదిద్దుకున్న ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’.. చిత్రకారుల కళాప్రజ్ఞకు అక్షర రూపమిచ్చే గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మొత్తం 300 మంది చిత్రకారుల వివరాలను పొందుపరిచారు. 300 పేజీల ఈ పుస్తకం ఖరీదు 1500 రూపాయలు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular