Monday, December 23, 2024
spot_img
HomeArtబాల మేధావికి సలాం కొట్టిన కలాం ‘ప్రపంచ రికార్డు’

బాల మేధావికి సలాం కొట్టిన కలాం ‘ప్రపంచ రికార్డు’

ఆర్ట్ టైమ్స్, నవంబర్ 2024 :  టీనేజ్ లో అడుగుపెట్టాక కూడా ఒకసారి విన్నది మర్చిపోకుండా గుర్తించుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. అంగడికి వెళ్లి సరుకులు తీసుకురమ్మంటే ఏదో ఒకటి మర్చిపోయి వచ్చే వాళ్ళు మనకి అడుగడుగునా తారసపడుతూనే ఉంటారు. అలాంటిది 2వ తరగతిలోనే 2.40నిమిషాలలోనే వివిధ దేశాలకు చెందిన 100 మంది శాస్త్రవేత్తల పేర్లు, వారు సృష్టించిన ఆవిష్కరణలను ఎక్కడా తడుముకోకుండా అనర్గళంగా చెప్పేసి అబ్బురపరిచాడు ఓ బాలుడు. అందుకే కలాం ప్రపంచ రికార్డు ఆ బాల మేధావికి సలాం కొట్టింది.

పసిప్రాయంలోనే అబ్బురపరించే జ్ఞాపకశక్తిని సొంతం చేసుకున్న ఆ చిచ్చర పిడుగే టి.ఎం.జైమిత్రన్. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ మండలం రామాపురంలోని ఎస్ఆర్ కండ్రిగై సొంతూరు. శ్రీసిటీ పని చేస్తున్న తెరపాలెం ముత్తు-దీప దంపతుల ఏకైక కుమారుడు. 2018, మే 7వ తేదీన కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్య క్షేత్రం తిరుపతిలో జన్మించాడు. ప్రస్తుతం వయసు ఆరేళ్ళు, రామాపురం ఎంపీపీఎస్&జెడ్పీపీఎస్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి ఏదైనా చెబితే ఇక మర్చిపోడు. ఆ విషయం గుర్తించిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ళు మర్చిపోయిన విషయాలను కూడా జైమిత్రన్ గుర్తుచేస్తూ ఉండేవాడట. తమ బిడ్డలోని ఆ ప్రతిభను చూసిన ముత్తు-దీప దంపతులు.. బంధువులు, పాఠశాల ఉపాధ్యాయుల సలహాలతో కలాం వరల్డ్ రికార్డు సాధన దిశగా బాబుకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక్క ఏడాదిలోనే జైమిత్రన్ ఈ సాధనలో విజయం సాధించాడు. అనితర సాధ్యమైన ప్రజ్ఞ కలిగిన వారికి గుర్తింపునిచ్చి, ప్రోత్సహిస్తోంది కలాం’స్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ. వారు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో జైమిత్రన్ పాల్గొన్నాడు. కేవలం 2 నిమిషాల 40 సెకన్లలోనే 100 మంది శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను చెప్పి సంచలనం సృష్టించాడు. అక్టోబర్ 25వ తేదీన బాలుడి ప్రపంచ రికార్డు సాధనను కలాం వరల్డ్ రికార్డ్స్ సంస్థ నమోదు చేసింది. అత్యంత వేగంగా 100 మంది శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను చెప్పిన పిన్న వయస్కుడిగా జైమిత్రన్ కు ఈ నెల 5వ తేదీన కలాం వరల్డ్ రికార్డు ధృవపత్రం అందజేశారు.

గర్వకారణం – గురువుల ఆశీస్సులు

బాలుడిని అభినందిస్తున్న పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు కామేశ్వరరావు

బాలుడు జైమిత్రన్ ప్రతిభను పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు కామేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన స్పందిస్తూ, “మా ప్రాథమిక పాఠశాల 2వ తరగతి విద్యార్థి టి.ఎం.జయమిత్రన్ అబ్దుల్ కలాం ఆన్‌లైన్ వరల్డ్ రికార్డ్ పోటీలో విజయం సాధించడం ఆనందంగా ఉంది. 2 నిమిషాల 40 సెకన్లలోనే 100 మంది శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను చెప్పి రికార్డు సృష్టించాడు. ఇది మా పాఠశాలకే గర్వకారణం” అని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తగా చూడాలని ఉంది..

ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా జైమిత్రన్ తల్లిదండులు తమ ఆనందాన్ని ‘ఆర్ట్ టైమ్స్’తో పంచుకున్నారు. అది వారి మాటల్లోనే.. “చాలా సంతోషంగా ఉండండి. చిన్నప్పటి నుండే బాబుకి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ విషయం చెప్పినా మర్చిపోడు. ఏదైనా చెబితే తిరిగి వెంటనే చెప్పేస్తాడు. ఒక్కోసారి మాకే కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు. జైమిత్రన్ లో ఈ ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. మా కజిన్స్ సలహాలు, పాఠాశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాము. ఒక్క ఏడాదిలోనే ఈ రికార్డు సాధించాడు. శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను ఠకఠకా చెప్పేస్తుంటే ఎంతో ముచ్చటగా ఉండేది. మా బిడ్డని కూడా మేము శాస్త్రవేత్తగా చూడాలని కోరుకుంటున్నాము”.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular