ఆర్ట్ టైమ్స్, నవంబర్ 2024 : ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అంటూ ఆరు దశాబ్దాల క్రితం ప్రఖ్యాత తెలుగు గేయ రచయిత ‘మనసు కవి’ ఆత్రేయ భారతీయ శిల్ప సౌందర్యం, శిల్ప కళా నైపుణ్యాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు. నిజమే కదా.. మహారాష్ట్రలోని అజంతా శిల్పాల అందానికి ఫిదా కానీ వారు ఎవరుంటారు? అటువంటి శిల్ప కళలో అద్భుతమైన ప్రతిభని కనబరుస్తూ.. భారతీయ శిల్పకళా వైశిష్ట్యాన్ని దుబాయ్ చిత్ర ప్రేమికుల చెంతకు తీసుకువెళ్ళారు కళాక్షేత్ర పూర్వ విద్యార్థి, ప్రపంచ రికార్డు విజేత, ఆర్ట్ క్యూరేటర్ అజంతా దాస్.
అస్సాంకు చెందిన అజంతా దుబాయ్ నగరంలోని ఇంటర్నేషనల్ స్టూడియో ఆఫ్ ఆర్ట్ అండ్ గ్యాలరీస్ గత అక్టోబర్ 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ చిత్ర కళా శిబిరంలో పాల్గొని శిల్ప కళలో మెళకువలను అక్కడి ఔత్సాహిక చిత్రకారులకు నేర్పించారు. ఈ చిత్రకళా శిబిరంలో వివిధ దేశాలకు చెందిన చిత్రకారులు పాల్గొన్నారు. భారతదేశం నుండి అజంతాదాస్, సీతా మేనన్, అనిత బాలాజీ, కేథరిన్ ఆనంద్, అనుబఫ్న, రుచిక రామ్ సింఘాని తదితరులు హాజరయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) దుబాయ్ లోని ఏఐ సఫా పార్క్ కాంప్లెక్స్ ఈ శిబిరానికి వేదికైంది.
ఆమె కళాభిరుచి స్ఫూర్తిదాయకం..
అజంతా శిల్పం అక్కడి చిత్ర ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు, పెద్దలు సైతం ఎంతో శ్రద్ధంగా అజంతా వర్క్ షాప్ లో పాల్గొని శిల్పాలు తయారు చేయడం నేర్చుకున్నారు. అజంతా శిల్ప కళా ప్రతిభను గుర్తించి.. శిల్ప కళాకారిణిగా, కళాత్మక ప్రతిభను పెంపొందించడంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ స్టూడియో ఆఫ్ ఆర్ట్ అండ్ గ్యాలరీస్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. “అజంతా దాస్ అపారమైన శిల్ప కళా నైపుణ్యం, మార్గదర్శకత్వంతో వర్క్‌షాప్ అద్భుతంగా జరిగింది. కళాక్షేత్ర పూర్వ విద్యార్థిగా, ప్రపంచ రికార్డు హోల్డర్‌గా, కళల పట్ల ఆమెకున్న అభిరుచి పాల్గొన్న వారందరికీ స్ఫూర్తినిచ్చింది. ఆమె చిత్రకళా పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను దుబాయ్ వాసులతో పంచుకున్నందుకు ఆమెకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిత్ర కళా ప్రపంచంలో ఆమె ప్రయాణం స్పూర్తిదాయకం” అని నిర్వాహకులు కొనియాడారు.
దుబాయ్ ప్రేమకు ఫిదా అయ్యాను.. అజంతా
ఇంటర్నేషనల్ స్టూడియో ఆఫ్ ఆర్ట్ అండ్ గ్యాలరీస్ చిత్ర కళా శిబిరంలో పాల్గొన్న అనుభవం గురించి అజంతా దాస్ ‘ఆర్ట్ టైమ్స్’ తో మాట్లాడుతూ “కళలకి, కళాకారులకి అనుకూలమైన గొప్ప ప్రదేశం దుబాయ్. అక్కడి కళా ప్రేమికులు నన్ను ఎంతో సాదరంగా స్వాగతించారు. కళాకారులకు వారు ఇచ్చే గౌరవం నమ్మశక్యం కానిది. వారికి శిల్ప కళలో శిక్షణ ఇవ్వడాన్ని ఎంతో ఆస్వాదించాను. దుబాయ్ చిత్రకారుల కుండలు, శిల్పం చాలా సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.