ఆర్ట్ టైమ్స్ (మార్చి 21, 2025): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన దివంగత తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు కాకర్లపూడి యోగ నారసింహ పతంజలి (కే.ఎన్.వై. పతంజలి) పేరిట ప్రతి ఏటా అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘పతంజలి’ సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ పాత్రికేయుడు, రచయిత తాడి ప్రకాష్ అందుకోబోతున్నారు. పతంజలి 73వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన ఈ పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నట్లు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరంలోని గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది పతంజలి జయంతి సందర్భంగా సాహితీ రంగంలో విశిష్ట కృషి చేస్తున్న ప్రముఖులకు పురస్కారం అందచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కార్టూనిస్ట్ మోహన్, దేవిప్రియ,శరత్ చంద్ర, చింతికింద శ్రీనివాసరావు, జి.ఆర్.మహర్షి, పప్పు అరుణ, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, సువర్ణముఖి తదితర సాహితీవేత్తలు ఈ పురస్కారం అందుకున్నారని తెలిపారు. 2025 సంవత్సరానికి గాను వి.ఎమ్.కె.లక్ష్మణరావు, బండ్లమూడి నాగేంద్ర ప్రసాద్, ఎన్.కె.బాబుతో కూడిన పురస్కార కమిటీ బృందం తాడి ప్రకాష్ పేరుని ప్రతిపాదించిందని భీశెట్టి తెలిపారు. మార్చి 29వ తేదీ శనివారం సాయంత్రం విజయనగరం గురజాడ గ్రంధాలయంలో పురస్కార ప్రదానం జరుగుతుందని, సాహితీ అభిమానులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని భీశెట్టి కోరారు. కాగా, ప్రతిష్టాత్మక పతంజలి సాహితీ పురస్కారానికి తాడి ప్రకాష్ ఎంపిక కావడం పట్ల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాహితీ రంగంలో ప్రకాష్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఆయన ఈ పురస్కారానికి పూర్తిగా అర్హులని పేర్కొన్నారు.
రచయిత తాడి ప్రకాష్ కి ‘పతంజలి’ సాహితీ పురస్కారం.. 29న విజయనగరంలో ప్రదానం
Trending Now
RELATED ARTICLES