Thursday, April 3, 2025
spot_img
HomeArtభారతీయ గ్రామీణ జీవన చిత్రానికి ప్రపంచం ఫిదా.. ఎం.ఎఫ్. హుసేన్ ‘గ్రామయాత్ర’కి రూ. 118 కోట్లు

భారతీయ గ్రామీణ జీవన చిత్రానికి ప్రపంచం ఫిదా.. ఎం.ఎఫ్. హుసేన్ ‘గ్రామయాత్ర’కి రూ. 118 కోట్లు

  • అతి ఖరీదైన కళాఖండంగా రికార్డు!

ఆర్ట్ టైమ్స్: భారతీయ సంస్కృతికి, భారతీయ గ్రామీణ జీవన విధానానికి యావత్ ప్రపంచం ఫిదా అవుతుందనడానికి మరో నిదర్శనం ఇది. కాన్వాస్ పై 1950లనాటి గ్రామీణ జీవన వైవిధ్యాన్ని సాక్షాత్కరింపజేస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంపాటలో ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ.118 కోట్ల ధర పలికింది. తద్వారా అతి ఖరీదైన భారతీయ కళాఖండంగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రసిద్ధ చిత్ర కళాకారిణి అమృతా షేర్ గిల్ 1937లో గీసిన “ద స్టోరీ టెల్లర్’ అనే చిత్రం పేరిట ఉండేది. ముంబయిలో 2023లో జరిగిన ఒక వేలంపాటలో ఆ చిత్రానికి రూ 61.8 కోట్లు లభించగా, న్యూయార్క్ నగరంలో ఈ నెల 19న జరిగిన క్రిస్టీ వేలంపాటలో ఎం.ఎఫ్.హుసేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం ఆ రికార్డును అధిగమించి చరిత్రపుటల్లోకి ఎక్కింది. భారతీయ గ్రామీణ జీవన వైవిధ్యాన్ని చాటే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలకడం పట్ల చిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

14 అడుగులు.. 13 చిత్రాలు.. 118 కోట్లు : న్యూయార్క్‌కు చెందిన క్రిస్టీ దక్షిణాసియా ఆధునిక, సమకాలీన కళల విభాగాధిపతి నిషాద్ అవారి ఈ రికార్డుపై స్పందిస్తూ.. ఇప్పటివరకు తన కెరీర్‌లో చూసిన అత్యంత వైవిద్యమైన చిత్రాలలో గ్రామయాత్ర ఒకటి అన్నారు.  14 అడుగుల కాన్వాస్ పై స్వాతంత్య్ర భారతావనిలో గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని 13 వేర్వేరు చిత్రాలతో హుస్సేన్ చిత్రీకరించారు. 1954లో నార్వే దేశానికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ లియాన్ ఎలియాస్ వోలోడరస్కీ కొనుగోలు చేశారు. ఆయనే ఈ చిత్రానికి అసలైన యజమాని. ఆయనకి కళాఖండాలను సేకరించే అలవాటు ఉండేది. అయితే వోలోడరస్కీ  1964లో ఓస్లో విశ్వవిద్యాలయ ఆసుపత్రికి ఈ చిత్రాన్ని కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రానికి వేలంపాటలో వచ్చిన నగదుని ఓస్లో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థుల శిక్షణ కార్యక్రమాల నిమిత్తం వినియోగించనున్నారు. కాగా, ఎం.ఎఫ్.హుసేన్ వేసిన చిత్రాలలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైనదిగా రీఇన్కార్నేషన్ అనే చిత్రం ఉండేది. గతేడాది లండన్ లో జరిగిన వేలంపాటలో ఈ చిత్రం రూ.25.7 కోట్ల ధర పలికింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular