Thursday, April 3, 2025
spot_img
HomeArtఏప్రిల్ 4న రాజమహేంద్రిలో ‘అమరావతి చిత్ర కళా ఉత్సవం’!.. పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

ఏప్రిల్ 4న రాజమహేంద్రిలో ‘అమరావతి చిత్ర కళా ఉత్సవం’!.. పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

  • కళాకారులకి ఆశాకిరణంగా నిలుస్తుందని కితాబు
  • దామెర్ల ఆర్ట్ గ్యాలరీ అభివృద్ధికి నిధుల సేకరణ

ఆర్ట్ టైమ్స్ (మార్చి 21, 2025): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి కళాఖండాలను ప్రదర్శించి, కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తూ చిత్ర కళా ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఇందుకు చారిత్రిక నేపధ్యం కలిగిన రాజమహేంద్రవరం వేదిక కాబోతుంది. “అమరావతి చిత్ర కళా వీధి” పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ కళాకారులకు ఆశాకిరణంలా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీన రాజమండ్రి, లాలా చెరువు రోడ్డులో జరగనున్న “అమరావతి చిత్ర కళా వీధి” పోస్టరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం అమరావతిలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్, పలు చిత్రకళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి ఉప ముఖ్యమంత్రికి “అమరావతి చిత్ర కళా వీధి” వివరాలు తెలియజేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని, నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో నా పూర్తి మద్దతు ఉంటుంది” అని హామీ ఇస్తూ.. చిత్రకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తేజస్వి పోడపాటి మాట్లాడుతూ, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ నాయకత్వంలో కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కమిషన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కళాకారుల సాధికారతకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని, చిత్రకారుల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి : చిత్రకారులను ప్రోత్సహించేందుకు కర్ణాటక, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఆంధ్రాలో చిత్రకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవుతోందని చిత్రకారులు వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపధ్యంలో సీనియర్ చిత్రకారులు, పలు చిత్రకళా సంస్థల చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ “అమరావతి చిత్ర కళా వీధి” పేరుతో రాష్ట్రంలోనే తొలిసారి ఈ తరహా కార్యక్రమం చేపడుతోంది. దీనిపై చిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే శీర్షికలో ‘చిత్ర కళా వీధి’కి బదులుగా చిత్ర కళా ఉత్సవం లేదా చిత్ర కళా పండుగ అని పెట్టి ఉంటే బాగుండేదని పలువురు చిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే చిత్రకారుల సంక్షేమమే లక్ష్యంగా చిత్రకారుల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ సమయంలో చిత్రకారులు ఎవరూ లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

దామెర్ల గ్యాలరీ అభివృద్ధికి నిధులు..

ఇదిలా ఉండగా, ప్రఖ్యాత తెలుగు చిత్రకారులు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అభివృద్ధికి “అమరావతి చిత్ర కళా వీధి” ద్వారా సమకూరే నిధులు వినియోగించనుండడం హర్షించదగ్గ విషయం.  చిన్నతనం నుండే చిత్రకళలో  ఎంతో నైపుణ్యం సంపాదించి, చిత్రకళను అభ్యసించి, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి, ఎందరో ప్రతిభావంతులైన శిష్యులను తీర్చిదిద్ది, తన కీర్తిని చిరస్థాయిగా నిలుపుకుని కేవలం కేవలం 28ఏళ్ళ చిరుప్రాయంలోనే దివికేగినా..  నేటికీ తన చిత్రాలతో అందరి హృదయాలలో సజీవంగా ఉన్న మహనీయులు శ్రీదామెర్ల రామారావు. ఆయన గీసిన చిత్రాలతో రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ సమీపంలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే సరైన నిర్వహణ లేక ఆ గ్యాలరీలోని దామెర్ల చిత్రాలు పాడైపోతున్నాయి. వాటిని పునరుద్ధరించి, దామెర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకుగాను కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా “అమరావతి చిత్ర కళా వీధి” ద్వారా సమకూరే నిధులు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ చిత్ర కళా ఉత్సవంలో సుమారు 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.  ఆ రోజు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. కళా ప్రేమికులు, ఔత్సాహికులు ఈ ఉత్సవంలో పాల్గొని, చిత్రాలను కొనుగోలు చేసి చిత్రాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular