Thursday, April 3, 2025
spot_img
HomeNewsపిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించండి : ఆపిల్ ప్లే స్కూల్ డైరెక్టర్ రంగ మాస్టర్

పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించండి : ఆపిల్ ప్లే స్కూల్ డైరెక్టర్ రంగ మాస్టర్

  • కోలాహలంగా చిన్నారుల ‘స్నాతకోత్సవ’ వేడుక
  • తల్లిదండ్రుల ఆనందోత్సాహం
  • లెఫ్టినెంట్ కమాండర్ చే డిగ్రీల పదానం

ఆర్ట్ టైమ్స్ (మార్చి 18, 2025): పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని, ప్రశ్నించడం అలవాటుగా మార్చాలని, ప్రశ్న నుండే అభివృద్ధికి బీజం పడుతుందని ఆపిల్ ప్లే స్కూల్ డైరెక్టర్ జి. రంగ వర ప్రసాద్ (రంగ మాస్టర్) తల్లిదండ్రులకు సూచించారు. కోనసీమ జిల్లా మండపేట పట్టణం బ్యాంక్ కాలనీలో రెండేళ్ళ క్రితం ప్రారంభమైన ఆపిల్ ప్లే స్కూల్ కిండర్ గార్టెన్ తొలి స్నాతకోత్సవ వేడుక సందర్భంగా ఆయన విద్యార్థుల విద్య, వ్యక్తిత్వవికాస ఎదుగుదలకు దోహదపడే అంశాలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. కేజీ-2 పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు పూర్తి చేసుకున్న (కిండర్ గార్టెన్ నుండి మొదటి తరగతికి వెళ్ళే) చిన్నారులకు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు ప్రదానం చేశారు.

జాతీయ గీతం ఆలపిస్తున్న చిన్నారులు

పసి వయసులో పిల్లలు సాధించిన విజయాలను వేడుకగా జరుపునే కార్యక్రమమే ఈ చిన్నారుల స్నాతకోత్సవ వేడుక. ఆపిల్ ప్లే స్కూల్ స్నాతకోత్సవం బాలబాలికల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరిగింది. స్నాతకోత్సవ గౌను, టోపీ ధరించిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆనందోత్సాహలకి గురయ్యారు. ముద్దులొలికే చిన్నారులను స్నాతకోత్సవ దుస్తుల్లో వేదికపై చూసేందుకు రెండు కళ్ళు చాల్లేదంటే అతిశయోక్తి కాదేమో!

స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు

స్కూల్ డైరెక్టర్ రంగ మాస్టర్, ప్రిన్సిపాల్ & కరస్పాండెంట్ ప్రజ్ఞ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి, ఆచార్యులు లెఫ్టినెంట్ కమాండర్ డా. కె.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు స్నాతకోత్సవ పత్రాలు, పతకాలను ప్రదానం చేశారు. ముందుగా చిన్నారులు స్వాగత గీతంతో అతిథులకు, ఆహూతులకు స్వాగతం పలికారు. ఆరంభంలో వందేమాతరం, ముగింపులో జాతీయ గీతం కేజీ విద్యార్ధులు ఆలపించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా విద్య, వార్షిక క్రీడా పోటీలు, ఇతర అంశాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన బాలబాలికలకు మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

ఆ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రజ్ఞ మాట్లాడుతూ, “ఆపిల్ స్కూల్ కిండర్ గార్టెన్ తొలి స్నాతకోత్సవ వేడుక ఇది. విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. బోధనలో అనునిత్యం కొత్త పద్ధతులు అమలుచేస్తూ ముందుకు సాగుతున్నాం. మా ఈ ప్రయాణంలో మాకు పూర్తి సహకారం అందిస్తున్న తల్లిదండ్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.” అని పేర్కొన్నారు.

ముఖ్యఅతిథికి జ్ఞాపికను బహూకరిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ ప్రజ్ఞ, డైరెక్టర్ రంగ మాస్టర్

అనంతరం పాఠశాల డైరెక్టర్ రంగ మాస్టర్ తల్లిదండ్రులకి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ, “పిల్లల్ని వేరే ఎవరితోనూ పోల్చి చిన్న బుచ్చుకునేలా చేయద్దు. ముఖ్యంగా పిల్లలు అడిగే ప్రశ్నలను కొట్టి పారేయద్దు. ప్రశ్నలు అడిగే విధంగా వారిని ప్రోత్సహించండి. ఒకసారి గుడిలో ఒక చిన్నారిని చూశాను. బహుశా మూడవ తరగతి చదువుతూ ఉండచ్చు. అబ్బాయి తండ్రి గుడిలో పూజ చేసిన ఒక పెన్ను తీసుకొచ్చి ఇచ్చి.. దీంతో రాస్తే బాగా రాస్తావు అన్నారు. అందుకు ఆ చిన్నారి ‘అయితే నేను చదవక్కర్లేదా?’ అని అడిగాడు. అందుకు తండ్రి కోపాన్ని ప్రదర్శించి ఏదో చెప్పారనుకోండి. చిన్నారి మదిలో మెదిలిన ఆ ప్రశ్నలో ఎంతో లోతైన అర్ధం ఉంది. ప్రశ్న నుండే అభివృద్ధికి బీజం పడుతుంది. తరాలు మారే కొద్దే అన్నీ మారుతాయి. ఆటలు, పాటలు, సాంకేతికత మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మనమూ మారాలి. మంచిని గ్రహించి పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించాలి. ప్రశ్నించడం పిల్లలకి అలవాటుగా మార్చాలి. మూఢనమ్మకాలను పిల్లలపై రుద్దకూడదు. లాజికల్ థింకింగ్ పైనే పిల్లల్ని ప్రోత్సహించాలి” అని పేర్కొంటూ.. చిన్న చిన్న కారణాలతో పిల్లలు స్కూల్ మానేయకుండా రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాలని తల్లిదండ్రులకు రంగ మాస్టర్ హితవు పలికారు.

ముఖ్య అతిథి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, “లిటిల్ గ్రాడ్యుయేట్ల వేడుకలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. విద్యాభ్యాసంలో తొలి అడుగు ఇది. ఇక్కడ బోధించే విషయాలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి. టీచర్లు చూపే సృజనాత్మకత పిల్లలపై ప్రభావం చూపుతుంది” అంటూ.. ఈ చిన్నారుల భవిష్యత్తు రంగులమయం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular