ఆర్ట్ టైమ్స్, మార్చి 2025: అమ్మ లాంటి తెలుగు భాష పరిరక్షణకు ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. అక్షర యజ్ఞం చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సైతం అంటున్నారు ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, నటుడు, సంగీత దర్శకుడు ‘డైలాగ్ స్టార్’, ‘కురళ్ సెల్వం’ ప్రవీణ్ చక్రవర్తి. అయితే ఆయన కాస్త భిన్నంగా తనకు నచ్చిన, జనం మెచ్చిన గాత్రంతో భాషాభివృద్దికి తన వంతు కృషి చేస్తుండడం హర్షించదగ్గ విషయం. స్వయంగా డబ్బింగ్ కళాకారుడైన ప్రవీణ్.. అక్షరాల ఉచ్చారణలో చాలా శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తారు. టీవీ చానల్స్ కార్యక్రమాల్లో యాంకర్లు మాట్లాడే భాష పట్ల ఆయన ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతహాగా న్యూస్ రీడర్ కూడా అయిన ఆయన.. స్వరం దేవుడిచ్చిన వరమని, అటువంటి వరాన్ని జనహితం కోసం ఉపయోగించాలని, భాషాభివృద్ధికి గాత్రం కూడా దోహదం చేస్తుందని అంటూ ఉంటారు. అంతేకాదు, తన శిష్యులకు భాషను నేర్చుకోమని, ఉచ్చారణలో దోషాలు లేకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడాలని చెబుతూ ఉంటారు. ఆయన్ని దగ్గరగా చూసిన వారికి ఈ విషయం తెలుస్తుంది. ఎటువంటి ప్రచార ఆర్భాటాల జోలికి పోకుండా భాష కోసం కృషి చేస్తున్న ఆయన గాత్ర సేవకు గుర్తింపుగా చెన్నై తాంబరంలోని మద్రాస్ క్రైస్తవ కళాశాల తెలుగుశాఖ అనుబంధ ‘ఆంధ్ర భాషాభిరంజని’ ఇటీవలే జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

‘ఆంధ్ర భాషాభిరంజని’ 137వ వార్షికోత్సవం ఈ నెల 7వ తేదీన కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఆ సందర్భంగా తెలుగుశాఖ ఆధ్వర్యంలో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, రంగోలి, పాటల పోటీలు నిర్వహించగా, వివిధ కళాశాలలకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వార్షికోత్సవ ముగింపు సమావేశంలో ఎంసీసీ పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ లోని గ్రీన్ స్టోన్ డెవలపర్స్ ఎండీ అమరేంద్రరెడ్డి ముఖ్య అతిథిగా, ఢిల్లీ ప్రెస్ మేగజైన్స్ జనరల్ మేనేజర్ ఇంద్రగంటి మాధురి ఆత్మీయ అతిధిగా హాజరయ్యారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య యజ్ఞశేఖర్, కళాశాల ఆచార్యులు డాక్టర్ సెల్వరాజ్, డాక్టర్ కలపాటి జోషువా తదితరుల సమక్షంలో అతిధుల చేతుల మీదుగా ప్రవీణ్ చక్రవర్తితో పాటు తాంబరం ఏసీ కామాక్షిరావు తెలుగు పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు గెడ్డం ఆదాము, కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహనశ్రీ, ఎంసీసీ లెక్కల విభాగంలో ఆచార్యుడిగా పని చేసి పదవీ విరమణ చేయబోతున్న ఆచార్య జ్యోతిసలోమిలకు జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు.
అవరోధాలను అవకాశాలుగా మార్చుకోండి.. విజయ శిఖరాలు చేరండి..!
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రవీణ్ చక్రవర్తి ‘ఆర్ట్ టైమ్స్’తో మాట్లాడుతూ, “కళా రాజధాని చెన్నైలోని 187 ఏళ్ల చరిత్ర కలిగిన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోని 137 ఏళ్ల తెలుగు కళా సంస్థ అయిన ఆంధ్ర భాషాభిరంజని ద్వారా నేను జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా నేను అక్కడ అనుభవించిన కొన్ని మధురమైన ఘట్టాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత వారి ఆత్మీయత, ఆహ్వానం తెలుగులో అద్భుతంగా ఉంది. కార్యక్రమంలో ముందుగా నిర్వహించిన పాటల పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు ఆలపించిన తేనె తెలుగు పాటలు నా మనసుకు చాలా హత్తుకున్నాయి. సినిమా గీతమైనా, లలిత గీతమైనా తెలుగులో మధురంగా పలుకుతుంటే ఆనందానుభూతికి లోనయ్యాను. నా వృత్తి గాత్రం, డబ్బింగ్ కళ.. చాలామంది కొన్ని కొన్ని అక్షరాలను పలకలేకపోతున్నారు. అక్షరాల ఉచ్చారణలో దోషాలు దొర్లుతూ ఉన్నాయి. వీటిని సరి చేయడంలో గురువులు పాత్ర చాలా ముఖ్యం. అటువంటి బృహత్కార్యాన్ని చేపడుతూ తేనెల తెలుగు పాటలను అందించిన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోని తెలుగు విభాగానికి అభినందనలు. విద్యార్థిని విద్యార్థులకు వారి గురువులు భాష విషయంలో చక్కని పునాదిని అందించారు. నేను విన్న నాలుగైదు పాటలలో ఎంతో చక్కగా పదాలను ఉచ్చరించడం విని మురిసిపోయాను. అందుకు వారి గురువులకు, ఆచార్య శ్రీపురం యజ్ఞశేఖర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన జీవితంలో లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ ముందుకు సాగితే విజయాలు దాసోహమంటాయి. రచయితగా, భరతనాట్య క్రియేటివ్ డైరెక్టర్ గా, అనువాద రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, న్యూస్ రీడర్ గా.. ఇలా నా కళా ప్రయాణంలో ఇన్ని మైలురాళ్లు ఉండడానికి కారణం అదే. నిన్నటి కన్నా నేటిని, నేటి కన్నా రేపటి మిన్నగా మనమే మార్చుకోవాలి. ఈ సమాజంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి, వాటిని మనం ఎలా అవకాశాలుగా మార్చుకోవాలన్నది యువత ఆలోచించాలి. నా జీవన, కళా ప్రయాణంలో ఎందరో మహానుభావులు నాకు ప్రేరణ కలిగించారు. ఈ పురస్కారాన్ని వారందరికీ అంకితం చేస్తున్నాను.” అని పేర్కొన్నారు.