ఆర్ట్ టైమ్స్ (మార్చి 9, 2025) : విలక్షణ శైలితో తెలుగు చిత్రకళా రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్న విజయనగరం జిల్లా విశ్రాంత డ్రాయింగ్ టీచర్, సీనియర్ చిత్రకారుడు బొడ్డేటి సూర్యనారాయణ ప్రతిష్టాత్మక కళాతపస్వి దామెర్ల రామారావు పురస్కారాన్ని అందుకున్నారు. చోడవరం చిత్రకళా పరిషత్ ద్వారా చిత్రకళాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. చిత్రకళా తపస్వి దామెర్ల రామారావు జయంతి, మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం చిత్రకళా శిబిరం ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని సన్ స్టార్ స్కూల్ ఇందుకు వేదికగా నిలిచింది. అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి బి.ఎస్.వి.రమేష్, అధ్యక్షులు పి.ఎల్.మోహన్, ఉపాధ్యక్షులు పిఎస్ఎస్ ప్రసాద్ ల సమక్షంలో కాకినాడ ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత జిల్లా చీఫ్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రదానం జరిగింది.
బొడ్డేటి సూర్యనారాయణతో పాటు చిత్రకారులు పి.చిదంబరేశ్వరరావు (విజయవాడ), వి. అంబికా దేవి (ఏలూరు), ఎస్.దేవ్ (ఏలూరు), జి.దుర్గారావు (శ్రీకాకుళం), కే.వి. శివ కుమార్ (విజయవాడ), ఎన్. శ్రీనివాస్ (విజయవాడ), కాకినాడ ఆంద్ర బ్యాంక్ విశ్రాంత జిల్లా చీఫ్ మేనేజర్ ఎం. సుబ్రహ్మణ్యేశ్వరరావు, కరీంనగర్ కు చెందిన లిమ్కా బుక్ రికార్డు సాధకులు ఎల్ఎన్ఎస్ఎస్ తిరునగరి దామెర్ల పురస్కారాలను అందుకున్నారు. ఆ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, దామెర్ల వంటి గొప్ప చిత్రకళా దార్శికుని పేరుమీద ఏర్పాటుచేసిన పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, ఈ పురస్కారంతో ఒక చిత్రకారుడుగా తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. సూర్యనారాయణకు అందుకున్న ఈ పురస్కారం పట్ల చోడవరం చిత్రకారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రేమ సమాజము రాజు, ఓఆర్ఆర్సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కన్నయ్యశెట్టి తదితరులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా, గిరిజన జీవ వైవిధ్యాన్ని కళ్ళకు కట్టినట్లు కాన్వాస్ పై ఆవిష్కరించే సూర్యనారాయణ మూర్తి చేసిన చిత్రాలను చూసి ఆహుతులు, అతిథులు ప్రశంసలు కురిపించారు.