ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 24, 2025): పసి వయసులో బడికి వెళ్తున్న చిన్నారులకు అన్నీ తామై అమ్మలా లాలించి, గురువులా బోధించి పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఇకపై ఉపాధ్యాయుల స్థాయి సేవలు అందించబోతున్నారు. ఇన్నాళ్ళు అంగన్‌వాడీ వర్కర్లగానే పిలుస్తున్న వారికి ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా గౌరవం దక్కబోతుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో ‘జ్ఞాన జ్యోతి’ని వెలిగించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు. ముద్దులొలికే చిన్నారులకు అంతే ముద్దుగా పాటలతో పాఠాలు చెప్పబోతున్నారు.. బొమ్మలతో జ్ఞానాన్ని పంచబోతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు నచ్చే విధంగా బోధించబోతున్నారు. కథలు, బొమ్మలు, సంజ్ఞల ద్వారా చిన్నారులకు కొత్త కొత్త అంశాలను నేర్పించబోతున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
120 రోజుల పాటు ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ..
3 నుండి 6 సంవత్సరాలలోపు బాలబాలికల పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జ్ఞాన జ్యోతి’ ప్రాజెక్టు పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు శిక్షణ ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా విధానంలో పలు మార్పులను తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే అంగన్‌వాడీ కార్యకర్తలకు దశలవారీగా 120 రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 55వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల పూర్వ ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేలా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్ (సాల్ట్) ప్రోగ్రాం సాంకేతిక సహకారంతో ‘జ్ఞానజ్యోతి’ శిక్షణ ఇస్తున్నారు. తొలిదశగా ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు, రెండో దశలో 22, 24, 25 తేదీల్లో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,344 ఉన్నత పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ శిక్షణలో చిన్నారుల మేథో అభివృద్ధి, శారీరక అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించగా, మూడో దశలో భాషాభివృద్ధి, నాలుగు, ఐదు దశల్లో సాంస్కృతిక, సృజనాత్మకత అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది నుంచి చేపట్టే మార్పులకు అనుగుణంగా అంగన్‌వాడీ కార్యకర్తలను ఉపాధ్యాయులు తరహాలో సిద్ధం చేస్తున్నారు. తరగతి గదుల్లో బోధన ఉపకరణాలు (టీఎల్‌ఎం) ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పే విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీఎల్‌ఎం తయారీపై శిక్షణ ఇస్తున్నారు.
మండపేట మండలంలో..

ఇక కోనసీమ జిల్లా మండపేట మండలం పరిధిలోని అర్బన్, రూరల్ అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు మండపేట ఏడిద రోడ్డులో ఉన్న ఎస్‌విఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ మండలం నుండి 92 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణలో పాల్గొన్నారు. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఏ.గజలక్ష్మి నేతృత్వంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్లు సిహెచ్ నాగ శ్రీదేవి, జి.నాగ సత్యవేణి, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఏ. మణికంఠ, ఎం.శ్రీనివాస్, ఎస్.అప్పారావుల బృందం శిక్షణ ఇచ్చారు. వారి సమక్షంలో బోధన మాడ్యూలు, మెటీరియల్ ను ఆవిష్కరించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, స్వచ్చంద సంస్థ ప్రథమ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.
బాధ్యత తీసుకోండి – బంగారు భవిష్యత్తు అందించండి..



ఇకపోతే చిన్న పిల్లలకు పాఠాలు చెప్పబోయే అంగన్‌వాడీ కార్యకర్తలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలా మారిపోయి కొత్త బోధనాంశాలను నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం తొణికిసలాడింది. అచ్చచ్చర పిల్లగాడు చిచ్చరపిడుగే, ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడే అంటూ వారు ప్రదర్శించిన ఆట పాటలు పిల్లలను మరింత ఆకట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు. జ్ఞాన జ్యోతి శిక్షణ అంగన్‌వాడీ కార్యకర్తలు తమ విధులను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రేరణనిస్తుంది. పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే గొప్ప అవకాశం ఇది. కాబట్టి అంగన్‌వాడీ కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ రెండో దశ ముగింపు కార్యక్రమంలో సిడిపిఓ ఏ.గజలక్ష్మి ‘ఆర్ట్ టైమ్స్’తో మాట్లాడుతూ, అంగన్‌వాడీ కార్యకర్తల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ శిక్షణ ఇస్తున్నారని, తద్వారా త్వరలో అమలు చేయబోతున్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేస్తున్నారని తెలిపారు. బోధనలో బట్టి పట్టించడం వంటి మూస ధోరణులకు స్వస్తి పలికి, ఆటలు పాటలు, చక్కని మాటలు, కథలుతో సరికొత్త విద్యా బోధన అందించేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా, హుషారుగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తి కనబరిచారని గజలక్ష్మి కొనియాడారు.