ఆర్ట్ టైమ్స్, ఫిబ్రవరి 25 : ఒకే చోట అత్యధిక మంది కూచిపూడి నాట్య ప్రదర్శన, ఒకే చోట అత్యధిక మందికి ఫోటోగ్రఫి శిక్షణ, ఒకే చోట అత్యధిక మందికి టైక్వాండో ప్రదర్శన.. ఇలా వివిధ అంశాల్లో సాధించిన గిన్నిస్ ప్రపంచ రికార్డుల సరసన ఇప్పుడు కరాటే కూడా చేరింది. అందుకు చెన్నై నగరం వేదికగా నిలిచింది. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ (WKMA) ఇండియా నేతృత్వంలో ఈ నెల 8వ తేదీన గిన్నిస్ రికార్డు సాధన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరాటేను ప్రోత్సహించడానికి, కరాటే మాస్టర్ల సంక్షేమం వంటి లక్ష్యాలతో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2,996 మంది ఒకే వేదికపై కరాటే శిక్షణ, ప్రదర్శన ఇవ్వడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించింది.
తూర్పు ఆసియా దేశాలలో ప్రజల స్వీయ రక్షణ కోసం తమిళుడైన బోధిధర్మ సృష్టించిన ఆత్మరక్షణ కళ స్ఫూర్తితో తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కరాటేలో గిన్నిస్ రికార్డు సాధన చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అసాధారణమైన ఆత్మరక్షణ కళను మన దేశంలోని ప్రతి పౌరుడికి అందించడం, పిల్లలు, మహిళలు, భావితరాలకు సురక్షితమైన సమాజాన్ని పెంపొందించడం కోసం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే తమిళనాడు స్పోర్ట్స్ యూనివర్సిటీలో వరల్డ్ రికార్డ్ ఈవెంట్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచ కరాటే చరిత్రలోనే అరుదైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుండి న్యాయనిర్ణేతలు ప్రత్యక్షంగా పాల్గొని సాధనను గుర్తించి, ఫిబ్రవరి 21న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో ఈ రికార్డును అధికారికంగా నమోదు చేశారు.

ఇందుకు భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 5,000 మందికి పైగా కరాటే అభ్యాసకులు సాక్షులుగా నిలవగా, 2,996 మంది అసాధారణ కరాటే ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి అధికారిక గుర్తింపు పొందారు. ఈ విషయమై చెన్నై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్, ఇండియా అధ్యక్షుడు బాలమురుగన్ మాట్లాడుతూ, భారతదేశ ప్రజలందరికీ కరాటేను చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం తమ అసోసియేషన్ కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ మద్దతు లభిస్తే కరాటేను చాలా సులభంగా ప్రజలకు చేరువ చేయగలుగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధి భరతన్, ప్రపంచ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్ర కూడా పాల్గొన్నారు.