ఆర్ట్ టైమ్స్, ఫిబ్రవరి : చెన్నై ప్రజలను ఎంతగానో అలరించిన ‘కామిక్ కాన్’ ప్రదర్శకులు ఈ సారి మరింత వైవిధ్యభరితమైన ప్రదర్శనలతో నగరవాసుల ముందు రాబోతున్నారు. నందంబాక్కంలోని చెన్నై ట్రేడ్ సెంటర్లో ఈ నెల 8, 9 తేదీలలో మారుతీ సుజుకి అరేనా ‘కామిక్ కాన్ – 2025’ ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల ఎ కార్యక్రమంలో భాగంగా వినోదం, వైవిధ్యం, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కామిక్స్, ఆనిమేషన్, గేమ్స్, సూపర్ హీరో సినిమాలు ప్రదర్శించనున్నారు. ఇంకా కామిక్ బుక్స్ అభిమానుల కోసం కళాకారుల సమావేశాలు, ప్యానెల్ చర్చలు, కళతో మిళితమైన స్టాండ్ అప్ కామెడీ ఉంటాయి. పాప్ సంస్కృతితో కూడిన ఈ వేడుక అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇమేజ్ కామిక్స్ ద్వారా రేడియంట్ బ్లాక్ స్పెషల్ నంబర్, యెన్ ప్రెస్ ద్వారా సోలో లెవలింగ్ పోస్టర్, స్మారక కామిక్ కాన్ ఇండియా బ్యాగ్ వంటి ప్రదర్శనలు ఉంటాయి. ఇక సూపర్ హీరో అభిమానుల కోసం ‘డాక్టర్ డూమ్ బస్ట్’, ‘డెడ్‌పూల్ & వోల్వరైన్’ టీ-షర్టులు, కీచైన్లు, ప్రత్యేకమైన కామిక్ కాన్ ఇండియా పజిల్, హీరోయిక్ కేప్ తదితర వస్తువులున్న ప్రత్యేక సూపర్‌ఫ్యాన్ బాక్స్ ను అందించనున్నారు.

ఈ కార్యక్రమం గురించి కామిక్ కాన్ ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ మాట్లాడుతూ, “గత సంవత్సరం చెన్నై వాసులు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఈసారి రెండవ ఎడిషన్ కోసం, మేము మరింత మరపురాని అనుభవాన్ని అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాము. ఇందులో మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు. “గతెడాది చెన్నై అసమానమైన ఉత్సాహంతో మమ్మల్ని స్వాగతించింది. పాప్ సాంస్కృతిక ప్రదర్శనలకు ఇక్కడ ఆదరణ పెరుగుతోంది. సరికొత్త వినోదాన్ని ఆస్వాదించేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు” అని నాడ్విన్ గేమింగ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ రథీ అన్నారు. కాగా, ఫిబ్రవరి 8, 9 తేదీలలో చెన్నై ట్రేడ్ సెంటర్ లో జరుగనున్న ‘కామిక్ కాన్-2025’లో పాల్గొనేందుకు Insider.in లేదా కామిక్ కాన్ ఇండియా వెబ్‌సైట్‌లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.