Thursday, April 3, 2025
spot_img
HomeArt‘వపా-బాపు ఆర్ట్ అకాడమీ’తో పాలకొల్లుకి చిత్రకళా శోభ.. ఎన్టీఆర్ కి  శతజయంతి ‘చిత్రాంజలి’.. మంత్రి చేతుల...

‘వపా-బాపు ఆర్ట్ అకాడమీ’తో పాలకొల్లుకి చిత్రకళా శోభ.. ఎన్టీఆర్ కి  శతజయంతి ‘చిత్రాంజలి’.. మంత్రి చేతుల మీదుగా చిత్రకారులకు సన్మానం

ఆర్ట్ టైమ్స్ : ప్రపంచ యవనికపై తెలుగు చిత్రకళ పతాకాన్ని రెపరెపలాడించిన వడ్డాది పాపయ్య, బాపు స్ఫూర్తితో పంచారామాల్లో ఒకటైన పాలకొల్లు పట్టణానికి చిత్రకళా శోభను తీసుకువస్తోంది వపా-బాపు ఆర్ట్ అకాడమీ. కళలకు నిలయమైన మద్రాసు నగరంలో ఊపిరి పోసుకున్న ఆలోచనతో.. కళా పోషకులకు నిలయమైన పాలకొల్లు పట్టణంలో ఆవిర్భవించిన చిత్రకళా సంస్థే  వపా-బాపు ఆర్ట్ అకాడమీ. 2015లో ఉదయించిన ఈ సంస్థ ఈ తొమ్మిదేళ్ళలో చిత్రకళకు ఎంతో సేవ చేసింది, చేస్తోంది. వీరి కళా సేవకి అండగా నిలుస్తోంది పాలకొల్లు లయన్స్ క్లబ్. చిత్రకళను భావితరాలకు అందించే లక్ష్యంతో స్థాపించిన వపా-బాపు ఆర్ట్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఈ నెల 1, 2 తేదీల్లో పాలకొల్లు నడిబొడ్డున ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో నెలకొన్న లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ వేదికగా జరిగిన ఈ వేడుకలో రెండవ రోజు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డా. నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, వపా-బాపు ఆర్ట్ అకాడమీ కళా సేవను, చిత్రకారుల ప్రతిభను కొనియాడి, బాల చిత్రకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమిష్టి కృషితో అకాడమీ అభివృద్ధి..

పాలకొల్లు వాస్తవ్యులు, చెన్నైలో స్థిరపడి చిత్రకళాకారుడిగా ఎదిగి తమిళ తెలుగు చిత్రకారులకు వారిధిగా నిలిచిన రామకృష్ణారావు అలియాస్ రాకీ.. సీనియర్ చిత్రకారుల స్ఫూర్తి, పాలకొల్లు చిత్రకారులు, లయన్స్ క్లబ్ సహకారంతో 2015లో వపా- బాపు ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆయన సారథ్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డా. కొయ్య జయభారత రెడ్డి, లయన్స్ క్లబ్ పూర్వాధ్యక్షులు కొమ్ముల మురళీకృష్ణ, అకాడమీ అధ్యక్షులు కొసనా భాస్కరరావు, కార్యదర్శి చెల్లుబోయిన రాము, కోశాధికారి నక్కా వెంకటేశ్వరరావు, సీనియర్ చిత్రకారులు జిఎస్ఎన్, సభ్యులు కడలి శ్రీనివాస్ తదితరులు అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. లయన్స్ క్లబ్ పాలకొల్లు, జేసిఐ పాలకొల్లు రైజింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలను ఈ బృందం వైవిధ్యభరితంగా నిర్వహించి ప్రసంశలు అందుకుంది. మొదటి రోజున బాల బాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించగా, 350 మంది పైగా పాల్గొని ఎంత ఉత్సాహంగా బొమ్మలు గీసి, తమ ప్రతిభను చాటుకున్నారు.

భువికి దిగి వచ్చిన ఎన్టీఆర్!

రెండో రోజు కార్యక్రమంలో భాగంగా దివంగత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని  దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారులతో లైవ్ పెయింటింగ్ ఆర్ట్ క్యాంపు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల నుండి 50 మందికి పైగా చిత్రకారులు ఈ శిబిరంలో పాల్గొని.. అక్కడికక్కడే వివిధ వేషధారణలు, ఆహార్యాలతో కూడిన ఎన్టీఆర్ ముఖ రూప చిత్రాలను గీసి అబ్బురపరిచారు. సీనియర్ చిత్రకారులతో పోటీపడి పలువురు యువ చిత్రాకారులు కూడా ఎన్టీఆర్ చిత్రాలను బహు చక్కగా గీసి ప్రశంసలు పొందారు. ఎన్టీఆర్ సినీ, ప్రజా జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళాకారులు కాన్వాస్ పై సాక్షాత్కరింపజేశారు. ఆ చిత్రాలను చూసిన వారికి ఎన్టీఆర్ దివి నుండి భువికి దిగి వచ్చినట్లుగా అనిపించిందంటే అతిశాయోక్తి కాదేమో!

కళా సేవకులకు ఘన సత్కారం..

ఈ వేడుకల్లో భాగంగా చిత్ర కళా రంగానికి సేవలందిస్తున్న ఐదుగురిని మంత్రి చేతుల మీదుగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బొమ్మలతో మన్ననలు పొంది, ఎంతోమందికి బొమ్మలు గీయడం నేర్పించి, భావోద్వేగాలను కాన్వాస్ మీద అద్భుతంగా పలికించి, భాషలు, ప్రాంతాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకుని, చిత్ర కళా రంగానికి ఎనలేని సేవలందిస్తున్న చోడవరం చిత్ర దిగ్గజం బొడ్డేటి సూర్యనారాయణను ‘చిత్రకళా ప్రపూర్ణ’ బిరుదును ప్రదానం చేశారు. అలాగే ది పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె.వి.ఆర్. నరసింహారావు, 64 కళలు.కామ్ ఎడిటర్ యల్లపు కళాసాగర్, భీమవరం సీనియర్ చిత్రకారులు పరిమి రామకృష్ణ, పాలకొల్లు ప్రముఖ చిత్రకారులు ముగడ నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్ట్ క్యాంప్ లో చిత్రకారులు గీసిన ఎన్టీఅర్ రూప చిత్రాలను మంత్రి వీక్షించి, చిత్రకారులను అభినందించారు. ఆ తరువాత చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు..

వపా-బాపు ఆర్ట్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవానికి చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు మరింత వన్నె తెచ్చాయి. పాలకొల్లుకి చెందిన శ్రీ గౌరీశంకర్ సంగీత నృత్య కళా అకాడమీ నాట్య గురువు అయినాల సూర్యనారాయణమూర్తి శిష్యబృందం కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలతో అలరించారు. లంబాడీ నాట్యం ఆకట్టుకుంది. అలాగే భారతీయ విద్యా భవన్స్ 7వ తరగతి విద్యార్ధిని పాప్ రాక్ సాంగ్ ‘బిలీవర్..’ ఇంగ్లీష్ పాటను ఆలపించి అబ్బురపరిచింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular