ఆర్ట్ టైమ్స్, జనవరి 19: చిత్రకళా రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు సీనియర్ చిత్రకారులు, చోడవరం చిత్రకళా పరిషత్ వ్యవస్థాపకులు బొడ్డేటి సూర్యనారాయణను కోనసీమ చిత్రకళా పరిషత్ ఘనంగా సత్కరించింది. అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణమంటపములో చిత్రకళా బ్రహ్మోత్సవం పేరిట ఆదివారం నిర్వహించిన 35వ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన, బహుమతి ప్రదానోత్సవంలో భాగంగా చిత్ర కళా రంగంలో దిగ్గజాలను నిర్వాహకులు సత్కరించారు. కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారుల చరిత్రతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా పలువురు సీనియర్ చిత్రకారులను సత్కరించారు. చోడవరానికి చెందిన చిత్ర దిగ్గజం బొడ్డేటి సూర్యనారాయణను అతిథులు డాక్టర్ వీరా ధన్వంతరి, శిల్పి పెద్దిరెడ్డి మాధవరావు, కె. కేశవవర్మ, అడబాల రామసత్యమూర్తి, ఆకుల రవితేజల సమక్షంలో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

ఆ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో చిత్ర కళా బ్రహ్మోత్సవంలో పాల్గొనడం, వివిధ ప్రాంతాలకు చెందిన చిత్రకారులను కలుసుకోవడం, ప్రకృతి రమణీయతకు నిలయమైన కోనసీమ ప్రాంతంలో ఒక చిత్రకారుడిగా సత్కారం పొందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, సూర్యనారాయణ సత్కారం పొందడం పట్ల ప్రేమ సమాజము రాజు, ఓఆర్ఆర్సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కన్నయ్యశెట్టి తదితరులు హర్షం వ్యక్తం చేసి, ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.