Sunday, January 12, 2025
spot_img
HomeArtచోడవరం చిత్ర దిగ్గజానికి నెల్లూరులో ఘన సత్కారం

చోడవరం చిత్ర దిగ్గజానికి నెల్లూరులో ఘన సత్కారం

ఆర్ట్ టైమ్స్, డిసెంబర్ 29 : కొన్ని వేలమందికి బొమ్మలు గీయడం నేర్పించారు.. ఆ బొమ్మలతోనే మన్ననలు పొందారు.. మానవ భావోద్వేగాలను కాన్వాస్ మీద అద్భుతంగా పలికించారు.. భాషలు, ప్రాంతాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆయనే చోడవరం చిత్ర దిగ్గజం బొడ్డేటి సూర్యనారాయణ. చిత్రకళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకుగాను నెల్లూరులోని అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. అకాడమీ 9వ జాతీయస్థాయి బాలల చిత్రకళ పోటీల బహుమతి కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ చిత్రకారులను సత్కరించారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీరావు చేతుల మీదుగా, గౌరవ అతిథులు 25 సంఘాలు సంస్థ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఎస్ఐ షేక్ నిజాముద్దీన్, నెల్లూరులోని మహేశ్వరి మెడికల్స్ అధినేత పేరూరి ప్రదీప్ తదితరుల సమక్షంలో నిర్వాహకులు నాలుగు దశాభ్దాల కొనసాగుతున్న సూర్యనారాయణ చిత్ర కళా ప్రతిభను, గురువుగా ఆయన అందించిన సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. పిల్లలకు బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమంలో.. చిన్నారుల పట్ల అమిత ఆప్యాయతానురాగాలు చూపించే సూర్యనారాయణను సత్కరించడం ముదావహమని సహ చిత్రకారులు పేర్కొన్నారు. చిత్ర రచనలో రాణించాలనుకునే బాలబాలికలు సూర్యనారాయణ చిత్రాలను చూసి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన చిత్ర కళా సేవలు భావి తరాలకు స్ఫూర్తి దాయకమని వారు కొనియాడారు.

బాలబాలికలకు చిత్ర రచనలో మెళకువలు నేర్పుతున్న సూర్యనారాయణ

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్రకారులు షేక్ అబ్దుల్లా (విజయవాడ), సంధ్య రంగుల (ఒంగోలు), డి ఆనంద్ రాజు (కడప), ఎం సుందర్ బాబు (నెల్లూరు) కూడా సన్మానం పొందారు. ఆ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, నెల్లూరు చిత్రకారులు అమీర్ జాన్ తన చిత్ర కళా ప్రతిభతో నెల్లూరు పట్టణానికే కాకుండా, తెలుగు చిత్ర కళా రంగానికే మంచి పేరు తీసుకువస్తున్నారని, ఆయన నిర్వహిస్తున్న అకాడమీ ద్వారా సన్మానం పొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ మాజీ సభ్యులు, హాస్యనటులు దోర్నాల హరిబాబు సభా నిర్వహణ చేపట్టగా, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నం, బాచి ఈవెంట్స్ శ్రీ భాస్కర్ కార్యక్రమం పర్యవేక్షణ చేపట్టారు. కాగా, సూర్యనారాయణకు దక్కిన ఈ గౌరవం పట్ల చోడవరం చిత్రకారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రేమ సమాజము రాజు, ఓఆర్ఆర్సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కన్నయ్యశెట్టి తదితరులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular