Monday, December 23, 2024
spot_img
HomeArtగౌరమ్మ వచ్చింది - సంబరాలు తెచ్చింది.. వైభవంగా గౌరీశంకరుల మహోత్సవాలు.. భక్తిపారశ్యంలో మునిగితేలిన ప్రజలు.. కోలాహలంగా...

గౌరమ్మ వచ్చింది – సంబరాలు తెచ్చింది.. వైభవంగా గౌరీశంకరుల మహోత్సవాలు.. భక్తిపారశ్యంలో మునిగితేలిన ప్రజలు.. కోలాహలంగా నిమజ్జనం ఊరేగింపు

ఆర్ట్ టైమ్స్, నవంబర్ 27, 2024 : మూడేళ్ళకొకసారి గౌరమ్మ వస్తుంది.. ఊరంతా సంబరాలు తెస్తుంది. పరమేశ్వరుడి సమేతంగా దర్శనమిచ్చి భక్తులను కటాక్షిస్తుంది. ఆ గౌరీశంకరులను చూసి కైలాసగిరి నుండి స్వయంగా దిగివచ్చినంతగా సంబరపడిపోతారు అక్కడి ప్రజలు. ఆ గ్రామమే ఇప్పనపాడు.

గౌరీశంకరులు

కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సమీపంలో నెలకొన్న ఇప్పనపాడు గ్రామంలో నెల రోజులకుపైగా గౌరమ్మ కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ గ్రామంలో మూడేళ్ళకొకసారి గ్రామ పెద్దలు, ప్రజలు కలిసికట్టుగా గౌరీశంకరుల మహోత్సవాలు నిర్వహిస్తారు. గౌరీశంకరుల గుడి రాట స్థాపనతో ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు బుధవారం నిమజ్జనం ఊరేగింపుతో ముగిశాయి. గ్రామంలోని గౌరీదేవి వీధిలో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపట్టి, గౌరీశంకరుల విగ్రహాన్ని ప్రతిష్టించి దాదాపు 40 రోజులపాటు ఉత్సవాలు జరిపారు. గ్రామ ప్రజలందరూ తమ ఊరికి వచ్చిన గౌరమ్మని కొలిచి, మొక్కులు తీర్చి, పూజలు చేసి భక్తిపారశ్యంలో మునిగితేలారు.

ఆది పూజలు బాల గౌరమ్మకే..

బాల గౌరమ్మ

గౌరమ్మని పూర్వ రోజుల్లో ‘సద్దికూడు గౌరమ్మ’ అని పిలిచేవారట. బెల్లంముక్క, సద్దన్నమే అమ్మవారికి నైవేద్యం. ఉత్సవాలు జరిగేటప్పుడు అర్ధరాత్రిళ్ళు గౌరమ్మ ఊరిలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం. సంతానం లేని వాళ్ళు బాలగౌరమ్మను ఎత్తుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ముందుగా బాల గౌరమ్మను తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. వరిదబ్బునే బాలగౌరమ్మగా కొలవడం విశేషం. అక్టోబర్ 23న బాల గౌరమ్మని తీసుకురాగా, నాలుగైదు రోజుల అనంతరం అంటే 28వ తేదీన మండపేట నుండి గౌరీశంకరుల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, గౌరీ వీధిలో ప్రతిష్టించారు. ఇప్పనపాడు పెద్దలు, ఉత్సవ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, భక్తులు గౌరీశంకరులను ఊరేగించారు. సంప్రదాయబద్దంగా భజనలు, భక్తి గీతాలాపనతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. గౌరమ్మని ఇప్పనపాడు గ్రామానికి తీసుకొచ్చారు.

నిత్య పూజలు – కళా సంబరాలు..

ఉత్సవాలలో భాగంగా భాస్కరరావు పంతులు శాస్త్రోక్తంగా గౌరీశంకరులకు నిత్య పూజలు జరిపించారు. అలాగే ప్రతిరోజూ ఉదయం కుంకుమ పూజలు జరిగాయి. గ్రామప్రజలు, దంపతులందరూ ఈ పూజల్లో పాల్గొని గౌరమ్మ కరుణాకటాక్షాలు పొందారు. ఇక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాట్య ప్రదర్శనలు, కోలాటాలు, నిమజ్జనం ముందు రోజున అంటే మంగళవారం నిర్వహించిన బతుకమ్మ పండుగ ఎంతో కోలాహలంగా సాగింది. మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడి, నాట్యం చేశారు.

అలాగే ఈ నెల 11వ కార్తీక దీపారాధన కన్నుల పండుగలా సాగగా, 20వ తేదీన అన్న సంతర్పణ చేపట్టి భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ఉత్సవాలు వైభవంగా జరిపించారు. ఉత్సవ కమిటీ ధర్మకర్త సవితిని ఉమా మహేశ్వరరావు నేతృత్వంలో కన్నంరెడ్డి వెంకటరమణ (అధ్యక్షులు), సభ్యులు తిరుశూల రాజేంద్రప్రసాద్ (చిన్ని), పల్లి అప్పన్న, ఇరోతు  మణికంఠ, నీలాటి వెంకట్రావు, తొండవరపు శ్రీను, కంబాల ఏడుకొండలు, పల్లి వీరబాబు, నీలాటి మురళీ, దివిని వెంకన్న, చలపరెడ్డి మల్లేశ్వరరావు తదితరులు ఉత్సవాల ఏర్పాట్లను చేపట్టారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సమన్వయంతో పనిచేశారు. దివిన కృష్ణ,మ్ అప్పికొండ లక్ష్మణ వంటి పెద్దలు ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

కోలాహలంగా నిమజ్జనం ఊరేగింపు..

ఉత్సవాలలో ఆఖరి ఘట్టమైన నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొని గౌరీ శంకరులకు వీడ్కోలు పలికారు. అష్టలక్ష్ములు కొలువుదీరిన రథంపై గౌరీశంకరులను ఆశీనులను చేసి, అడుగడుగునా పూజలు చేస్తూ ఊరంతా ఊరేగించారు. ప్రజలందరూ రథం దగ్గర ఫోటోలు దిగుతూ, చిన్నారులు గౌరీ శంకరుల చెంతనే కూర్చొని సందడి చేశారు. గౌరీదేవి వీధి నుండి ఇప్పనపాడు గ్రామ ప్రధాన రహదారి మీదుగా తాపేశ్వరం మార్కెట్ వరకు, తిరిగి అదే మార్గంలో వెనక్కి వచ్చి చిన్న ద్వారపూడి సమీపంలోని లాకుల వద్ద గౌరీశంకరుల విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఊరేగింపులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. ఆలమూరు, రావులపాలెం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు కోయ డ్యాన్స్, శివభక్తుల నృత్యాలు, దేవతల వేషధారణలో విశేషంగా ఆకట్టుకున్నారు. ‘కాంతారా’ దైవ స్వరూపం అదనపు ఆకర్షణ. ఇక ఈ రోజుల్లో ఊరేగింపులంటే ముందుగా గుర్తుకొచ్చే డీజేల సందడి కూడా తక్కువేమీ కాదు.  ఇదిలాఉండగా, నిమజ్జనం కోసం ఉదయం 11 గంటల సమయంలో గౌరమ్మని తీసుకెళ్లేందుకు అంతా సిద్ధం చేయగా, గౌరమ్మ భక్తులపై ఆవహించి తాను ఇంకా ఉంటానని, వెళ్లనని గొడవ చేసిందని, బ్రతిమాలి పంపించామని నిర్వాహకులు తెలిపారు.

మళ్ళీ 2026 చివరలో.. నిమజ్జనం అనంతరం పప్పు జావను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఉత్సవాలకు స్వస్తి పలుకుతారు. ఆ నైవేద్యాన్ని అమ్మవారి పేరు మీద బాలబాలికలకు పంచిపెడతారు. కాగా, గౌరీశంకరుల ఉత్సవాలను మూడేళ్ళకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంటే.. ఉత్సవాలు జరిగిన మరుసటి ఏడాది విరామం ఇచ్చి.. ఆ తరువాత ఏడాది మళ్ళీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ప్రకారం మళ్ళీ 2026 చివరలో ఉత్సవాలు జరుగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular