Monday, December 23, 2024
spot_img
HomeArtచిత్ర కళా ‘దర్శిని’.. కలైకూడం సేవలకు ప్రశంసలు.. 21 రాష్ట్రాల చిత్రకారులకు పురస్కారాలు

చిత్ర కళా ‘దర్శిని’.. కలైకూడం సేవలకు ప్రశంసలు.. 21 రాష్ట్రాల చిత్రకారులకు పురస్కారాలు

ఆర్ట్ టైమ్స్ : “సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో కళలకు ముఖ్యమైన పాత్ర ఉంది. అందులో చిత్ర కళ కూడా ఒకటి. ఈ కళను భావి తరాలకు అందించేందుకు కృషి చేస్తూ.. బాలబాలికల్లో ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించి, నైపుణ్యాన్ని మెరుగుపరిచి చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ దర్శిని కలైకూడం సేవలు అమోఘం” అని  అతిథులు కొనియాడారు. చెన్నైలోని తమిళనాడు డా. జె జయలలిత సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయం అనుబంధంగా చిత్ర కళలో శిక్షణ ఇస్తున్న శ్రీ దర్శిని కలైకూడం ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ (ఆఫ్ క్యాంపస్) 20 వార్షికోత్సవ వేడుక ఈ నెల 17వ తేదీన ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక సహా 21 రాష్ట్రాలకు చెందిన చిత్రకారులకు జాతీయ చిత్ర కళా పురస్కారాలు అందజేసి సత్కరించడం విశేషం. ఇందుకు చెన్నై టి.నగర్ జి.ఎన్.చెట్టి రోడ్డులో ఉన్న వాణి మహల్ వేదికైంది.

తమిళనాడు టి.నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జె.కరుణానిధి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. గిండీలోని తమిళనాడు రోడ్ సెక్టార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ ఎస్.ఎ.రామన్, పాండిచ్చేరి క్రాఫ్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు, యునెస్కో అవార్డు గ్రహీత పద్మశ్రీ వి.కె.మునుస్వామి, తమిళనాడు డాక్టర్ జయలలిత సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.శక్తివేల్ ప్రత్యేక అతిథులుగా పాల్గొనన్నారు. దర్శిని కలైకూడం వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో చిత్రకారులకు నిర్వహించిన పోటీల విజేతలకు చిత్ర కళా పురస్కారాలు, జాతీయ బాలల చిత్ర రచన పోటీల విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. లక్ష రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ‘నాకు వందమందిని ఇవ్వండి – సమాజాన్ని మార్చి చూపిస్తా’ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో సంగీతం, చిత్రకళ, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న 100 మంది చిత్రకారులను సత్కరించినట్లు శ్రీ దర్శిని కలైకూడం వ్యవస్థాపకులు డి.ధర్మలింగం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య కళా ప్రదర్శన ఆహూతులను, కలాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

బొమ్మలు గీస్తుంటే ఆనందం కలుగుతుంది..

ఈ సందర్భంగా శాసనసభ్యులు కరుణానిధి మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం కళలను, కళాకారులను గుర్తించి, ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ.. కళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీ దర్శిని కలైకూడం చిత్ర కళా రంగంలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఎస్‌ఏ రామన్ ఐఏఎస్ పాఠశాల రోజుల్లో చిత్రలేఖన పాత్ర గురించి ప్రస్తావిస్తూ, “బొమ్మలు అంటే ప్రతి ఒక్కరికి బాల్యం గుర్తుకొస్తుంది. పాఠాశాలలో చదువు ఏదైనా పిల్లలు బాగా ఇష్టంగా చేసే పని బొమ్మలు గీయడం. నా చిన్న వయసులో చదువు కంటే బొమ్మలంటే ఎక్కువ ఇష్టం ఉండేది. బొమ్మలు గీయడానికే ఎక్కువ సమయం కేటాయించేవాడిని. బొమ్మలు గీస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది” అన్నారు. పద్మశ్రీ  వీకే మునుసామి వృత్తి విద్య, సాంకేతిక అభివృద్ధి గురించి యువ చిత్రకారులకు అవగాహన కల్పించారు. ప్రతిభ ఉండాలే గాని ఏ రంగంలో అయినా రాణించగలరని, చిత్ర కళకు మరింత గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

పాండిచ్చేరి క్రాఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు, నేషనల్, యునెస్కో అవార్డుల గ్రహీత పద్మశ్రీ వి.కే.మునుసామితో తెలుగు చిత్రకారులు అద్దిపల్లి, సూర్యనారాయణ, రాకీ ఆత్మీయ కలయిక

తెలుగు విజేతలు.. సీనియర్ చిత్రకారుల విభాగంలో బొడ్డేటి సూర్యనారాయణ (చోడవరం), సాహితి శ్రీ తాళ్లూరి (సికింద్రాబాద్), బీటీ కృష్ణ (అనకాపల్లి), అద్దిపల్లి అప్పలనాయుడు (చోడవరం), కె. హిందేవి (గుంటూరు), కడలి శ్రీనివాస్ (పాలకొల్లు), జి సత్యనారాయణ (పాలకొల్లు), విద్యార్ధుల విభాగ్మలో పి వైష్ణవి (తెలంగాణ), ఎన్.కరుణాకర్ (గూడూరు), సుజయ్ వనయన్ (హైదరాబాద్), ఎం సమంత అష్లిన్ (హైదరాబాద్), యాలిని (హైదరాబాద్), కార్తికేయ (ఆంధ్రప్రదేశ్), డ్రాయింగ్ టీచర్ల విభాగంలో డాక్టర్ పుప్పాల బాపిరాజు, బి ఏడుకొండలు (తిరుపతి), కార్తీక (అనంతపూర్), ఎస్ వినోద్ కుమార్ (అనంతపూర్), సి నాని (అనకాపల్లి), బి సుమతి (అనకాపల్లి), వై శ్రీలత (హైదరాబాద్), కే. సుప్రియ (హైదరాబాద్)లు బహుమతులు గెలుచుకున్నారు.  చెన్నై స్థిరపడిన సీనియర్ చిత్రకారులు రామకృష్ణ (రాకీ), చోడవరం చిత్ర కళానికేతన్ వ్యవస్థాపకులు బొడ్డేటి సూర్యనారాయణ, హైదరాబాద్ కేఎల్ యూనివర్శిటీ ఆర్ట్స్ మెంటార్ అద్దిపల్లి అప్పలనాయుడు దర్శిని కలైకూడం చేస్తున్న చిత్ర కళా సేవలను కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular