Monday, December 23, 2024
spot_img
HomeCinemaవిజువల్స్ అదిరాయి.. కానీ! ‘గ్లాడియేటర్ 2’ సినిమా రివ్యూ

విజువల్స్ అదిరాయి.. కానీ! ‘గ్లాడియేటర్ 2’ సినిమా రివ్యూ

ఆర్ట్ టైమ్స్ : ‘గ్లాడియేటర్’ విడుదలై 24 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఆ సినిమాకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హాలీవుడ్ నటుడు రస్సెల్ క్రోవ్ పోషించిన విలక్షణమైన మాగ్జిమస్ పాత్రని సినిమా చూసిన ప్రేక్షకులు ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. 2000లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం. పురాతన రోమ్ సామ్రాజ్య సంస్కృతిని, ఆనాటి అద్భుతమైన కట్టడాలను, రాజుల నిరంకుశ ధోరణులు, కుట్రలు, కుతంత్రాలు, యోధుల పరాక్రమాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇండియన్ సినిమాపై కూడా  ‘గ్లాడియేటర్’ ప్రభావం చాలా ఉంది. అటువంటి సెల్యూలాయిడ్ వండర్ కి సీక్వెల్ గా ‘గ్లాడియేటర్2’ తెరకెక్కుతుందని తెలిసినప్పటి నుండి సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడూ చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నవంబర్ 15 శుక్రవారం ‘గ్లాడియేటర్2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ భాషలు తెలుగు, తమిళం, హిందీలోనూ అనువదించి విడుదల చేశారు. మరి  భారీ అంచనాల నడుమ వచ్చిన ‘గ్లాడియేటర్2’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

తెరపై బొమ్మ పడగానే.. టైటిల్స్ వస్తున్నప్పుడు గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంది. అలాగే ఆరంభంలోనే భారీ యుద్ధ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల్ని కొన్ని నిమిషాల్లోనే పురాతన రోమ్ కి తీసుకెళ్ళిపోయారు దర్శకుడు రిడ్లీ స్కాట్.  రోమ్ రాజుల నిరంకుశాన్ని, అప్పటి యుద్ధ తంత్రాలను, పరాక్రమ యోధుల పోరాటాలను ఈ యుద్ధ సన్నివేశంలో చాలా చక్కగా చూపించారు. విజువల్స్ అదిరిపోయాయి. ఇదొక్కటే కాదు, సినిమాలో పోరాట దృశ్యాలన్నీ అద్భుతంగా చిత్రీకరించారు.

రస్సెల్ క్రో

కథ ఏమిటంటే.. రణభూమిలో వీర మరణం పొందిన గ్రేట్ గ్లాడియేటర్ మాక్సిమస్ (రస్సెల్ క్రో) చిన్న కొడుకు లూసియస్ (పాల్ మెస్కాల్) యోధుడిగా మారినప్పటి నుండి కథ మొదలవుతుంది. అతను నివసిస్తున్న రాజ్యంపై రోమ్ సైన్యం దండెత్తి, యుద్ధంలో జయించి లుసిల్లా సహా అనేక మంది యోదులని యుద్ధ ఖైదీలుగా రోమ్ నగరానికి తీసుకువెళతారు.లూసియస్ పరాక్రమం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతనిని ఒక బానిసగా మార్కినస్ (డెంజల్ వాషింగ్టన్) కొనుగోలు చేసి, తన రాజకీయ ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటాడు. అలా కుట్ర కుతంత్రాలతో రోమ్ రాజ్యంలో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు. మార్కినస్ రాజనీతిని లూసియస్ తన యుద్ధనీతితో ఎలా జయించాడు? అనేది “గ్లాడియేటర్ 2” కథ.

పాల్ మెస్కాల్ గ్లాడియేటర్ పాత్రలో అలరించినప్పటికీ.. రస్సెల్ క్రో పోషించిన అసలు గ్లాడియేటర్ గొప్పతనాన్ని అందుకోలేకపోయాడనే చెప్పాలి. కోనీ నెల్సన్ తల్లిగా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన డెంజల్ వాషింగ్టన్ మహాభారతంలో శకుని తరహా పాత్రలో పూర్తి మార్కులు కొట్టేశారు. అతను తొలిసారి పూర్తి స్థాయి నెగిటివ్ పాత్రలో నటించడం ఈ పాత్రకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. “గ్లాడియేటర్” ఓ విజువల్ వండర్, సీక్వెల్ తో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నారు. విజువల్స్, యాక్షన్ పరంగా తొలి భాగానికి ఏమాత్రం తీసిపోకుండానే ఉంది. అయితే కథను రక్తి కట్టించడంలో, ప్రేక్షకుల్ని భావొద్వేగాలకు గురి చేయడంలో విఫలమయ్యారు. ‘గ్లాడియేటర్’లో విజువల్స్, ఎమోషన్స్ రెండూ రెండు కళ్ళుగా ఉంటాయి. ‘గ్లాడియేటర్ 2’ ఈ విషయంలో వెనుకబడింది. అయితే విజువల్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. పురాతన రోమ్ నగరాన్ని తెరపై చూపించిన విధానం, సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ వంటివన్నీ అద్భుతంగా కుదిరాయి. మొత్తానికి ‘గ్లాడియేటర్’ అభిమానులకు రెండో భాగం కూడా మంచి అనుభూతినే మిగుల్చుతుంది.

ఇంకెన్నాళ్ళీ ‘తెగులు’ : డబ్బింగ్ సినిమాల భాష విషయంలో నిర్మాణ సంస్థలు పెద్దగా శ్రద్ధ కనబరచడం లేదని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.  ‘గ్లాడియేటర్ 2’ వంటి ప్రపంచ స్థాయి సినిమా, 2500 కోట్లు వ్యయంతో తెరకెక్కించిన సినిమా డబ్బింగ్ నాసిరకంగా ఉండడం దురదృష్టకరం. టైటిల్స్ లో అక్షర దోషాలు, ఆంగ్లంలో ఉన్నది ఉన్నట్టుగా.. ఉదాహరణకి Produced by – ప్రొడ్యూస్డ్ బై అని అలాగే రాశారు. నిర్మాణం లేక నిర్మాత అని చక్కగా తెలుగులో రాస్తే ఎంత బాగుండేది. Director Ridly scott film అని ఆంగ్లంలో ఉంటే.. తెలుగులో ‘డైరెక్టర్ రిడ్లీ స్కా ట్ఫీలిం’ అని ఉంది. వాళ్ళ ఉద్దేశ్యం డైరెక్టర్ రిడ్లీ స్కాట్ ఫిలిం అయ్యుండచ్చు. అన్ని వందల బడ్జెట్ పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమాలో ఇటువంటి భాషాపరమైన లోపాలు  ఉండడం బాధాకరం. ఇక తెలుగు అనువాదంలో కొన్ని సంభాషణలు, కామెడీ కోసం చొప్పించిన డైలాగులు కూడా తెలుగు భాషకి తెగులు పట్టించేటట్టు ఉన్నాయి. సినిమాలు తీసేవారు భాష విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే మంచిది.

నటీనటులు: పాల్ మెస్కల్, పెడ్రో పాస్కల్, ఫ్రెడ్ హెచింగర్, లైయర్ రాజ్, డెరిక్ జాకోబి, డెంజెల్ వాషింగ్టన్ తదితరులు

దర్శకత్వం: రిడ్లీ స్కాట్

స్క్రీన్ ప్లే: డేవిడ్ స్కార్పా

కథ: పీటర్ క్రెయిగ్

సినిమాటోగ్రఫీ: జాన్ మాథిసన్

ఎడిటింగ్: క్లెయిర్ సింప్సన్

మ్యూజిక్: హ్యారీ గ్రేగ్ సన్, విలియమ్స్

రేటింగ్  : 3.5/5

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular