Monday, December 23, 2024
spot_img
HomeArtజాలరుల కష్టానికి చిత్ర నీరాజనం.. చోడవరం చిత్రకారులు సూర్యనారాయణకు చెన్నైలో సత్కారం

జాలరుల కష్టానికి చిత్ర నీరాజనం.. చోడవరం చిత్రకారులు సూర్యనారాయణకు చెన్నైలో సత్కారం

ఆర్ట్ టైమ్స్, నవంబర్ 17, 2024: బతుకు తెరువు కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలో చేపలు వేటకు వెళ్ళే జాలరుల కష్టాన్ని స్ఫురించేలా.. మత్స్యకారుల జీవన చిత్రాన్ని ప్రజలకు దగ్గర చేసే విధంగా సీనియర్ తెలుగు చిత్రకారులు, చోడవరం చిత్ర కళానికేతన్ వ్యవస్థాపకులు బొడ్డేటి సూర్యనారాయణ గీసిన చిత్రం కళాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. చెన్నై మహానగరంలో చిత్ర కళలో శిక్షణ ఇస్తున్న శ్రీ దర్శిని కలైకూడం 20వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సూర్యనారాయణకు జాతీయ చిత్ర కళా పురస్కారం ప్రదానం చేసి, చిత్ర కళారంగానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.

సూర్యనారాయణకు జ్ఞాపిక అందజేస్తున్న తమిళనాడు ఎమ్మెల్యే జె.కరుణానిధి

చెన్నై టి.నగర్ జి.ఎన్.చెట్టి రోడ్డులో ఉన్న వాణి మహల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దర్శిని కలైకూడం జాతీయ స్థాయిలో చిత్రకారులకు నిర్వహించిన పోటీలు, చిత్ర ప్రదర్శన కోసం సూర్యనారాయణ చేపల వేటకి వెళ్లేందుకు సముద్రంలోకి పడవని నెడుతున్న జాలరుల చిత్రం వేశారు. తమిళనాడు టి.నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జె.కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరై చిత్రకారులను సత్కరించారు. జాలరుల చిత్రానికిగాను సూర్యనారాయణకు జ్ఞాపికతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఆ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, శ్రీ దర్శిని కలైకూడం వ్యవస్థాపకులు డి. ధర్మలింగం చిత్ర కళకు ఎంతో సేవ చేస్తున్నారని, వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకారులను ప్రోత్సహిస్తూ కళకి భాషాభేదం లేదని చాటి చెబుతున్నారని కొనియాడారు. ఇదిలా ఉండగా, చెన్నైలో సత్కారం పొందిన సూర్యనారాయణకు ప్రేమ సమాజము రాజు, ఓ.ఆర్.ఆర్.సి ప్రసాద్, కొండలరావు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, కృష్ణ, కన్నయ్యశెట్టి, పలువురు చిత్రకారులు అభినందనలు తెలియజేశారు.

పాండిచ్చేరి క్రాఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు, నేషనల్, యునెస్కో అవార్డుల గ్రహీత పద్మశ్రీ వి.కే.మునుసామితో తెలుగు చిత్రకారులు అద్దిపల్లి, సూర్యనారాయణ, రాకీ ఆత్మీయ కలయిక

చిత్ర నీరాజనం.. బతుకు తెరువు కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలో చేపలు వేటకు వెళ్ళే జాలరుల కష్టాలను స్ఫురించేలా.. చేపలు పట్టడంలో వారికున్న చేవని పడవను నెట్టడంలో అగుపించేలా చాలా చక్కగా సూర్యనారాయణ ఈ చిత్రాన్ని గీశారు. నిజానికి సంద్రంలోకి వెళ్ళే జాలరులు తిరిగి వచ్చే వరకు వారి కుటుంబీకులు బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటారు. వారికి సంఘీభావంగా జాలరుల సంక్షేమం కోసం ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని గీసినట్లు సూర్యనారాయణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular