ఆర్ట్ టైమ్స్: ఆ చిత్రాన్ని చూడగానే.. ఏంటిరా ఇలా ఉంది అనిపిస్తుంది. ఎక్కడ చూసినా రేఖలు, ముక్కలు అతుకులే అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ, మనసుతో చూస్తే.. ఈ చిత్రం లోతుల్లోకి వెళితే గొప్ప సందేశం గోచరిస్తుంది. అదే క్యూబిజం ఆర్ట్ గొప్పతనం. ఇదొక భిన్నమైన చిత్ర రచన శైలి. పైన కనిపిస్తున్న చిత్రాన్ని పరిశీలిస్తే రేఖలు, ముక్కలు, కళ్ళు.. ఇవే కనిపిస్తున్నాయి కదా. బాహ్య రూపం గందరగోళంగా కనిపించినా.. మనసు పొరల్లోంచి తట్టి లేపే ఎన్నో ఊహల సమాహారమే ఈ చిత్రం. చెన్నైలో స్థిరపడిన సీనియర్ తెలుగు చిత్రకారులు రామకృష్ణ (రాకీ) గీసిన క్యూబిజం ఆర్ట్ ఇది. కేరళలో వయనాడు పర్వతశ్రేణుల్లో పర్వత శిఖర సమీపంలో ఉన్న తపోవనం ప్రాంగణంలో ఇటీవలే జరిగిన చిత్ర కళా శిబిరంలో భాగంగా ఆయన ఈ చిత్రాన్ని గీశారు. ఆయన చూసింది, ప్రకృతి నుండి గ్రహించింది, అర్ధం చేసుకున్నది సమ్మిళితం చేసి బొమ్మని గీసి.. ఆయన చెప్పాలనుకున్న భావాన్ని మన మనస్సుల్లో నుండే బయటకి రప్పించే ప్రయత్నంగా కూడా చెప్పుకోవచ్చు. అక్రిలిక్ మీడియంలో కాన్వాస్ పై కేవలం రెండు గంటల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం మరో విశేషం.
ఈ చిత్రం గురించి రాకీ ‘ఆర్ట్ టైమ్స్’తో మాట్లాడుతూ “ప్రకృతిని చూస్తుంటే ఎన్నో భావాలు, ఎన్నో అనుభూతులు కలుగుతాయి. ఈ చిత్రాన్ని పలు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ప్రకృతి ఎంతో అందమైనది. కానీ అన్నింట్లోనూ మంచి, చెడు ఉంటాయి. పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ప్రకృతిని కొందరు ఆస్వాదిస్తారు, మరికొందరు భయపడతారు.. ఆ భావనలు అన్నీ స్ఫురించేలా ఈ చిత్రం గీశాను” అని వివరించారు.