Monday, December 23, 2024
spot_img
HomeArtచిత్రంలో శిల్పం.. శిల్పంలో చరిత్ర! విలక్షణం రజనీ కళా నైపుణ్యం

చిత్రంలో శిల్పం.. శిల్పంలో చరిత్ర! విలక్షణం రజనీ కళా నైపుణ్యం

ఆర్ట్ టైమ్స్: ప్రాచీన భారతం గురించి బొమ్మ గీయమంటే.. ప్రాచీన భారత చరిత్రనే మన ముందుకు తీసుకువచ్చారు యువ చిత్రకారిణి రజనీ. కళాభిరుచి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అంటే ఇదేనేమో. ఒక చిత్రాన్ని గీయడం కోసం అన్వేషణ మొదలుపెట్టి.. వందలు, వేల సంవత్సరాల క్రిత్రం నాటి చరిత్రని నేటి కళా ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. అదే సుల్తాన్ గంజ్ బుద్ధ శిల్పం. ఇటీవలే ఒంగోలులో సృష్టి ఆర్ట్స్ అకాడమీ, కళాయజ్ఞ సంస్థలు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీల కోసం రజనీ పురాతన సుల్తాన్ గంజ్ బుద్ధ రాగి విగ్రహం చిత్రాన్ని గీశారు. కాకినాడకు చెందిన వి.రజినీ గీసిన ఈ చిత్రం అందరి ప్రశంసలు పొంది, ప్రథమ బహుమతి గెలుచుకుంది.

ఒంగోలు చిత్రోత్సవంలో మొదటి బహుమతి అందుకుంటున్న రజనీ

ఒంగోలు చిత్ర కళా పోటీలు, ప్రదర్శనలో భాగంగా రజనీకి ప్రాచీన భారతం నినాదంతో  చిత్రం గీయమని సూచించారు. ఆమె గురువు, ప్రముఖ తెలుగు చిత్రకారులు, క్రియేటివ్ హార్ట్స్ వ్యవస్థాపకులు అంజి ఆకొండి, కళాయజ్ఞ వ్యవస్థాపకులు ఏలూరి శేష బ్రహ్మంల ప్రోత్సాహంతో రజనీ ఈ పోటీలకు సంసిద్ధమయ్యారు. ప్రాచీన భారత అన్వేషణ మొదలుపెట్టి చరిత్రలోకి వెళ్ళిపోయారు. ఆమెలోని కళాతృష్ణ 500-700 AD మధ్య కాలం వరకు ఆమెని తీసుకెళ్ళింది. పురాతన సుల్తాన్ గంజ్ బుద్ధ రాగి విగ్రహం గురించి తెలిసింది. ఆ శిల్పం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పరిశోధన చేశారు. సుల్తాన్ గంజ్ బుద్ధ రాగి విగ్రహం గుప్త-పాలా కాలంనాటిది. 2.3 మీటర్ల ఎత్తు, 1 మీటరు వెడల్పుతో 500 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. A3 సైజులో అక్రిలిక్ మీడియంలో రజనీ బుద్ధుని చిత్రాన్ని గీశారు. దాదాపు 15 గంటలు సమయం వెచ్చించి ఈ విలక్షణ శిల్ప చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు.

అమూల్యమైన సలహాలు ఇచ్చారు : ఈ పురాతన శిల్పం, తను గీసిన చిత్రం గురించి విశేషాలను రజనీ ‘ఆర్ట్ టైమ్స్’తో పంచుకున్నారు. “ఒంగోలులో చిత్ర కళా ప్రదర్శన, పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అదృష్టం కొద్ది నాకు ఇంత చక్కని అవకాశం దక్కిందని భావిస్తున్నాను. నాకు ప్రాచీన భారతం అనే మంచి టాపిక్ ఇచ్చారు. భిన్నంగా ఉండాలని చరిత్రాన్వేషణ మొదలుపట్టాను. 500-700 బి.సి నాటి రాగి విగ్రహం గురించి తెలిసింది.

గతంలో రజనీ గీసిన విద్యాంజలి చిత్రం

1862లో ఈస్టిండియ కంపెనీవారు రైల్వే ట్రాక్ కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు సుల్తాన్ గంజ్ ప్రాంతంలో ఈ విగ్రహం దొరికిందట. నిలబడి ఉన్న బుద్ధ విగ్రహాలు చాలా అరుదు. అందులోనూ రాగి లోహంతో తయారు చేసింది. గుప్తులు, పాలుల కాలం నాటి చిత్ర శైలి ఈ శిల్పంలో స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వందల సంవత్సరాలు గడిచినా విగ్రహం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తరువాత ఆ విగ్రహాన్ని ఇంగ్లాడుకి తీసుకెళ్ళిపోయారనుకోండి. ఆ విగ్రహాన్నే చిత్రంగా గీయాలని నిర్ణయించుకున్నాను. బ్యాక్ గ్రౌండ్ కోసం బిహార్ సంచీ స్థూపంలోని తోరణాల నుండి స్ఫూర్తి పొందాను. ఇక ప్రాచీనత కోసం పాత కాగితం తరహాలో చిరిగినట్లుగా, నలిగినట్లుగా గీశాను. ఒక చిత్రకారిణిగా ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఒంగోలు చిత్రోత్సవంలో పాల్గొనడం, 100 మందికి పైగా గొప్ప చిత్రకారులను కలిసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సీనియర్ చిత్రకారులు నాలాంటి వర్ధమాన కళాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. చిత్ర రచనలో అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. నాకు ఇలాంటి ఒక గొప్ప అవకాశం దక్కేందుకు కారణమైన నా గురువు అంజి ఆకొండిగారికి, నా చిత్ర కళా పయనంలో అడుగడుగునా అండగా నిలుస్తున్న మా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను” అని రజనీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular