Monday, December 23, 2024
spot_img
HomeArtఇదొక చిత్రకళా ‘సాగరం’.. ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’కి విజయ ఆయంచ ప్రశంస

ఇదొక చిత్రకళా ‘సాగరం’.. ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’కి విజయ ఆయంచ ప్రశంస

ఆర్ట్ టైమ్స్, నవంబర్ 11, 2024 : 300 మంది తెలుగు చిత్రకారుల కళా సేవ, వారు గీసిన అద్భుతమైన చిత్రాలతో రూపొందిన ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకాన్ని చిత్ర కళా ‘సాగరం’గా అభివర్ణించారు సీనియర్ తెలుగు చిత్రకారిణి విజయ ఆయంచ. ఇటీవలే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 64 కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకులు కళాసాగర్ సంపాదకత్వంలో ముద్రితమైన ఈ పుస్తకంలో దిగ్గజాలను స్మరించుకుంటూ, సమకాలీన చిత్ర, శిల్ప కళాకారులు కళాకారులు 300 మంది చిత్ర కళా విశేషాలు ఉన్నాయి. వారిలో విజయ ఆయంచ కూడా ఒకరు.

విజయ ఆయంచను సత్కరిస్తున్న నిర్వాహకులు

తండ్రి ప్రోత్సాహంతో 8వ యేట నుండే బొమ్మలు గీయడం మొదలుపెట్టిన ఆమె.. పెద్దన్నయ్య ఆయిల్ పెయింటింగ్స్ స్ఫూర్తితో .. ఇంటర్మీడియట్ నుండి ఆయిల్ పెయింటింగ్స్ వేయడం ప్రారంభించారు. తరువాత పెళ్లి, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే హాబీగా చిత్ర కళను కొనసాగించారు. 15 ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో స్థిరపడిన తరువాత తనలోని కళాతృష్ణ నెరవేర్చుకునే దిశగా పూర్తి స్థాయిలో చిత్ర రచనపై దృష్టి సారించారు. ప్రఖ్యాత చిత్రకారులు దార్ల నాగేశ్వరరావు సహకారంతో పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ లో పాల్గొనేవారు. అలాగే చిత్ర రచన పోటీలు, బృంద ప్రదర్శనలు, చిత్ర కళా శిబిరాలలో పాల్గొంటూ.. ఇలా 50 ఏళ్ళుగా చిత్ర కళా రంగంలో కొనసాగుతున్నారు. విజయ చిత్ర కళా ప్రస్థానంలో ఆమె భర్త వీరబ్రహ్మాచార్యులు ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ దంపతులు ఇరువురూ పాల్గొని చిత్రకళపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ సందర్భంగా నిర్వాహకులు విజయ ఆయంచను సత్కరించారు. ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ గురించి ఆమె స్పందిస్తూ.. “ఈ పుస్తకంలో నాకు కూడా స్థానం కల్పించినందుకు కళాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వందలాది మంది గొప్ప చిత్రకారులతో పాటు నా చిత్రాలు కూడా ఈ పుస్తకంలో ముద్రితం కావడం ఆనందంగా ఉంది. వెయ్యికి పైగా అద్భుతమైన చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక గొప్ప చిత్రకళా సాగరం” అని పేర్కొన్నారు.

50ఏళ్ళ క్రితం అంటే 1974లో విజయ గీసిన శకుంతల చిత్రం
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular