ఆర్ట్ టైమ్స్ : తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా రాణించి.. ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన పాత్రల్లో మెప్పిస్తూ, సీరియల్స్ లోను నటిస్తున్న సీనియర్ తార దేవయాని మళ్లీ వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో దర్శన్ ఫిలింస్ పతాకంపై జ్యోతి శివ నిర్మిస్తున్న ‘నిళర్ కుడై’ చిత్రంలో కథానాయిక స్థాయి పాత్రలో ఆమె నటిస్తున్నారు.
శివ ఆరుముగం కథ రాసి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ధమాన తారలు విజిత్, కన్మణి హీరోహీరోయిన్లు. రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, వడివుక్కరసి, కవితా రవి, అక్షర, బాలతారలు ఆహానా నిహారిక, అహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శన్ అనే యువకుడు భిన్నమైన పాత్రతో వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగో థ్రిల్లర్ చిత్రం ఇది. నేటి యువత ఆధునికత మోజులో పడి తల్లిదండ్రులు, పిల్లలను, కుటుంబ బంధాలను నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి కరెక్ట్ కాదనే చక్కని సందేశంతో ‘నిళర్ కుడై’ తెరకెక్కుతోంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి నరేన్ బాలకుమార్ సంగీతం, ఆర్ బి గురుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.