ఆర్ట్ టైమ్స్ : తమిళంలో తెరకెక్కుతున్న ఒక చిత్రానికి అరబిక్ పదాన్ని టైటిల్ గా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ చిత్రమే ‘హబీబి’. ప్రముఖ నటుడు ధనుష్ తండ్రి, ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘అవళ్ పెయర్ తమిళరసి’, ‘విళిత్తిరు’ చిత్రాలతో దర్శకత్వ ప్రతిభ చాటుకున్న మీరా కదిరవన్ ‘హబీబి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టైటిల్ గురించి ఆయన్ని అడిగితే, “కథ ప్రకారం కరెక్టుగా ఉంటుందని భావించి హబీబీ అని పెట్టాం. ఈ అరబిక్ పదానికి ఖచ్చితమైన తమిళ అర్థం ‘ఎన్ అన్బే’ (ప్రియమైన బంధమా) అని. అరబిక్ పదమే అయినా సినిమా చూశాక ప్రేక్షకులు ఆ విషయాన్నే మర్చిపోతారు” అని చెప్పారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మాత సురేష్ కామాక్షి ఈ చిత్రాన్ని వీక్షించి, బాగా నచ్చడంతో తానే స్వయంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దక్షిణ తమిళనాడులోని తమిళం మాట్లాడే ముస్లింల జీవనశైలి నేపథ్యంలో ‘హబీబీ’ తెరకెక్కుతోంది. చక్కని ప్రేమకథని జోడించి జనరంజకంగా రూపొందించారు. కాగా, ఈ చిత్రంలో కొత్త నటి ఈషా ప్రధాన పాత్రను పోషించగా, ‘జో’ సినిమాలో నటనతో యువ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మాళవిక మోహన్ లీడ్ రోల్ లో నటిస్తోంది.