ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణిస్తున్నారు. కష్టతరమైన ఉద్యోగాలలో సైతం సత్తా చాటుతున్నారు. ఆ క్రమంలోనే సముద్రంపై నౌకలలో ప్రయాణిస్తూ చేసే ఉద్యోగాలలోను స్త్రీల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం విశేషం. నిజానికి నౌకాయన రంగంలో విదేశీ మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు భారతదేశంలోనూ మహిళలు సముద్రంపై నౌకలలో ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ లాజిస్టిక్స్ కంపెనీ మార్స్క్ (A.P. Moller – Maersk) తమ కంపెనీలో నావికులలో 45% మహిళలే ఉన్నట్లు ప్రకటించింది. నౌకాయాన రంగంలో తక్కువగా ఉన్న మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. సంద్రంలో సమానత్వం (Equal At Sea) అనే నినాదంతో మార్స్క్ నౌకాయాన రంగంలో మహిళా ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2022లో మొదలైన ఈ ప్రచారానికి భారతీయ యువతుల నుండి మంచి స్పందన లభించింది. దీంతో కేవలం మూడు సంవత్సరాలలో 41 నుండి 350కి మహిళా నావికుల సంఖ్య పెరిగినట్లు మార్స్క్ ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయిగా సంస్థ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. 2024లో నాటికల్, ఇంజినీరింగ్ విభాగం క్యాడెట్‌లలో 45% మంది మహిళలు ఉన్నారని, 2027 నాటికి పూర్తిగా లింగ సమాన ప్రాతినిధ్యమే తమ లక్ష్యమని ముంబైలో సోమవారం జరిగిన ‘ఈక్వల్ ఎట్ సీ’ సదస్సులో వారు పేర్కొన్నారు. ఈ సదస్సులో భారతదేశంలోని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వానే అతిథిగా పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సముద్రాలకు లింగభేదం తెలియదు. సముద్ర వృత్తిలో లింగ వైవిధ్యాన్ని సాధించడం ద్వారా మార్స్క్ సమానత్వం వైపు అడుగులు వేయడమే కాకుండా, నౌకాయాన పరిశ్రమలో ఆవిష్కరణలు, అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కోర్సును అందిస్తోంది. సుదూర సముద్ర తీర ప్రాంతాలు కలిగి ఉన్న భారతదేశం, డెన్మార్క్ ఈ మార్పుకు నాయకత్వం వహించి, ఈ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి కృషి చేయాలి” అని సూచించారు. మార్స్క్ ఆసియా హెడ్ కరణ్ కొచర్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు సముద్రయానాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ సంఖ్య 45%కి చేరుకోవడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. అయితే మరింత మారింది ప్రేరణగా నిలిచేందుకు ఈ వృత్తిని చేపట్టే మహిళలు కూడా అమితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.