ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) దక్షిణాదిలో ఒక నూతన మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో హోండా యాక్టివా విక్రయాలు ఒక కోటి దాటాయి. ఇందులో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో 10 మిలియన్ యూనిట్లకు పైగా ‘యాక్టివా’ ద్విచక్రవాహన విక్రయాలు జరిగినట్లు హోండా వెల్లడించింది. తద్వారా దేశంలో అత్యధికమంది ప్రాధాన్యత ఇస్తున్న స్కూటర్‌గా యాక్టివా నిలిచింది. 2001లో తొలిసారిగా ప్రవేశపెట్టిన హోండా యాక్టివా భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పూర్తిగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆరంభం నుండి యాక్టివాకి వాహనదారుల నుండి మంచి స్పందనే లభిస్తోంది. సగటు మధ్య తరగతి కుటుంబంలో యాక్టివా ఒక ముఖ్య భాగంగా మారిందనడంలో సందేహం లేదు. ప్రధానంగా దక్షిణాదిన 2017 నాటికి 50 లక్షల విక్రయాలు జరిగాయి. ఇందుకు దాదాపు 16 సంవత్సరాలు సమయం పడితే, తదుపరి 50 లక్షల విక్రయాలు కేవలం 7 సంవత్సరాలలో జరగడం విశేషం. ఇందులో 110సీసీ, 125సీసీ మోడళ్లతో సహా యాక్టివా ఫ్యామిలీ విక్రయాలు ఉన్నాయి.
ఈ మైలురాయి గురించి హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ, దక్షిణాదిలో ఒక కోటి యాక్టివా విక్రయాల మార్కును సాధించడం కస్టమర్ల విశ్వాసం, విధేయతకు నిదర్శనంగా పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనదారుల అభిరుచి, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని నిరంతరం ఆవిష్కరణలను కొనసాగించడమే తమ విజయానికి కారణమని అన్నారు.