ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : ప్రపంచ వ్యాప్తంగా పెనుసమస్యగా మారిన ప్లాస్టిక్ వ్యర్ధాల ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో మరింత తీవ్రస్థాయిలో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యావరణానికి, సమాజానికి మేలు జరిగేలా.. ఏటా 32వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగం చేసి, సుమారు 15వేల టన్నుల కార్బన్ ఉద్గారాలను వాతావరణంలోకి చేరకుండా తగ్గించే విధంగా షార్ప్ వెంచర్స్ సంస్థ ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్, చత్తీస్ ఘర్ రాజధాని రాయపూర్ నగరాలను ఎంచుకుంది. సమగ్ర పునర్వినియోగ పరిష్కారాలను అందించే ఆసియాలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన షార్ప్ వెంచర్స్ సంస్థ బుధవారం ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించింది.
అత్యుత్తమ నాణ్యతతో కూడిన పునర్వినియోగ ప్లాస్టిక్ పదార్ధాలను సరఫరా చేసి, వాటి ద్వారా పర్యావరణ సానుకూల, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను చేపడతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం షార్ప్ వెంచర్స్, రీ సస్టైనబిలిటీ లిమిటెడ్, మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మారికో లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ భారతదేశంలో దీర్ఘకాలిక సామాజిక, పర్యావరణ సానుకూల ఆవిష్కరణల స్థాయిని గుర్తించి, వాటి అమలుకు మద్దతు ఇస్తుంది. ఈ ఫౌండేషన్ 2022లో “ఇన్నోవేషన్ ఇన్ ప్లాస్టిక్స్: ది పొటెన్షియల్ అండ్ పాసిబిలిటీస్” అనే నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాలను పరిష్కరించడానికి ఒక మిషన్‌ను ప్రారంభించింది.
హైదరబాదు, రాయపూరే ఎందుకు?
ఈ పథకాన్ని అమలు చేయడానికి హైదరాబాద్, రాయపూర్ నగరాలని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని షార్ప్ వెంచర్స్ తెలిపింది. “జన సాంద్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణలో సవాళ్ళు కారణంగా ఈ రెండు నగరాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశాము. మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాదులో ప్రతి ఏటా అత్యధిక స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారీ ఎత్తున రీసైక్లింగ్ ప్రక్రియలను అమలు చేయడానికి, అధునాతన వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికతల వినియోగానికి అనువైన ప్రదేశంగా ఉంది. ఇక పట్టణ కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌పూర్.. వ్యర్థాల నిర్వహణకు భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటుంది” అని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణతో పాటు మొదటి దశలో 370 మందికి పైగా ప్రత్యక్షంగా, 2,000 మందికి పరోక్ష జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతేకాకుండా, సమర్థవంతమైన వ్యర్థాల విభజన, రీసైక్లింగ్ ప్రక్రియల్లో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో క్రియాశీల భాగస్వామ్యం, బాధ్యతను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు గురించి మారికో లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా మాట్లాడుతూ, పర్యావరణం, సమాజం రెండింటికీ ప్రయోజనం చేకూర్చే విధంగా, ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా ఒక బృహత్తర పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. అధిక నాణ్యత కలిగిన రీసైకిల్ పదార్థాల సరఫరాను పెంచడం ద్వారా, స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను రూపొందించడం తమ లక్ష్యమని తెలిపారు.
రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ ఎండీ, సిఈఓ మసూద్ మల్లిక్ మాట్లాడుతూ, “అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సవాళ్ళను అధిగమించడం, రీసైక్లింగ్ చేయదగినవి పల్లపు ప్రాంతాలకు చేరకుండా నివారించడం మా లక్ష్యం. మనం ఉత్పత్తి చేసే ప్రతి కిలోగ్రాము వ్యర్థాలతో ముడిపడిన వనరుల పరిరక్షణ, కార్బన్ తగ్గింపు అవకాశం, ఇంకా కాలుష్య నివారణ ప్రభావాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము. వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంతో దానిని విలువైన వనరులుగా మార్చడం, ఆవిష్కరణలను సృష్టించడం ద్వారా పరిశుభ్రమైన, మరింత స్థిరమైన వాతావరణానికి, రాబోయే తరాల మంచి భవిష్యత్తుకు మార్గం సుగమం చేయవచ్చు” అని పేర్కొన్నారు.