ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 2024 : ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. కానీ, ఇకపై కార్డు అవసరం లేదు. అంతేకాదు, మన ఖాతాలో నగదు జమ చేయడానికి కూడా కార్డు అవసరం లేదు. ఎందుకంటే, డెబిట్ కార్డు లేకుండానే ఏటిఎంలో నగదు జమ చేసే కొత్త డిజిటల్ పేమెంట్ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) భాగస్వామ్యంతో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రవేశపెట్టింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే ఈ నూతన పేమెంట్ విధానాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ వేదికపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబీ శంకర్ ప్రకటించారు. ఆ కార్యక్రమంలో ఎన్సీపీఐ ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి, ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కార్డు లేకుండానే ఏటిఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి, నగదు విత్ డ్రా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకులు నిర్వహించే ఏ ఏటిఎం సెంటర్ లో అయినా క్యాష్ డిపాజిట్ మెషిన్ (సిడీఎం)లు ద్వారా తమ ఖాతా బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయవచ్చు. UPI-ICD విధానానికి అనుగుణంగా ఏటీఎం కేంద్రాలను ఆధునీకరించనున్నారు. క్యాష్ రీసైక్లర్ టెక్నాలజీని ఏటిఎం కేంద్రాలకు జోడిస్తున్నామని, వినియోగదారులు నగదును సజావుగా డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని ఎన్సీపీఐ పేర్కొంది. కాగా, భారత్ బిల్ పేమెంట్ సిస్టంను భారత్ కనెక్ట్ తో అనుసంధానం చేస్తున్నట్లు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ దీప్ తెలిపారు.
డెబిట్ కార్డు లేకుండానే.. యూపిఐతో ఏటిఎంలో నగదు జమ
Trending Now