ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 22, 2024: భారతదేశం సగర్వంగా జరుపుకోబోయే తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సమయం ఆసన్నమైంది. ‘చంద్రయాన్-3’ మిషన్లో భాగంగా ఆగస్టు 23, 2023న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా, సాఫ్ట్‌గా ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తద్వారా చంద్రునిపై దిగిన నాల్గవ దేశంగా, చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. సాఫ్ట్ ల్యాండింగ్ తరువాత ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా తన కార్యకలాపాలు చేపట్టింది. ల్యాండింగ్ సైట్‌కు ‘శివశక్తి’ పాయింట్ అని పేరు పెట్టి, ఆగస్టు 23ని “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా ప్రకటించారు. ఆ ప్రకారం భారతదేశం తన తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2024న జరుపుకోనుంది.
తెలుగు కుంచె చిత్ర నీరాజనం..
ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రముఖ తెలుగు చిత్రకారులు కాట్రేనికోనకు చెందిన అంజి ఆకొండి చిత్ర నీరాజనం అర్పించారు. భారత అంతరిక్ష వైశిష్ట్యాన్ని తెలియజేసే విధంగా ప్రత్యేకమైన చిత్రాన్ని గీశారు. అంతరిక్ష పరిశోధనల్లో విశేషమైన కృషి చేసిన భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ ఆద్యుడు, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో గౌరవించబడిన ప్రముఖ భారతీయ బౌతిక శాస్త్రవేత్త విక్రం అంబాలాల్ సారాభాయ్ గారిని స్మరించుకుంటూ, భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గీసిన చిత్రం చిత్ర ప్రేమికులను, ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.