ఆర్ట్ టైమ్స్, జూలై 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సు డ్రైవర్లు తీరు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కొంతమంది డ్రైవర్లు చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సులను నడుపుతున్నారు. బస్సు నడుపుతున్నప్పుడు అసలు సెల్ఫోన్ మాట్లాడడం పూర్తిగా నిషేధం అన్న నిబంధనను తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అత్యవసర కాల్స్ మాత్రమే కాకుండా సరదా కోసం, కాలక్షేపం కబుర్ల కోసం కూడా ఫోన్ మాట్లాడుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కొంతమంది డ్రైవర్లు అయితే బస్సు నడుపుతూ రీల్స్ చూస్తుండడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ఓ వైపు ప్రయాణికులు హెచ్చరించినా పట్టించుకోకపోవడమే కాకుండా, కొందరు మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో చాలామంది బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తూ, గమ్యస్థానం చేరుకోగానే బతుకు జీవుడా అంటూ దిగి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండగా, అధికారులు తీసుకుంటున్న చర్యలు చర్యలను డ్రైవర్లు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిపెట్టి ప్రజల ప్రాణాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై ఒక ప్రయాణీకుడు స్పందిస్తూ, సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సులు నడిపే డ్రైవర్లపై ఫిర్యాదు చేయాలంటే ఆ జాబితా చాలా పెద్దగా ఉంటుందని, కాబట్టి అధికారులు డ్రైవర్లు అందరికీ ఈ విషయమై కౌన్సిలింగ్ ఇచ్చి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మారని బస్సు డ్రైవర్ల తీరు – ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు
Trending Now